Jul 30,2023 21:39

కాలువలపై నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

పార్వతీపురం టౌన్‌: మున్సిపల్‌ పరిధి పలుచోట్ల ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలపై భవన నిర్మాణ యజమానులు అక్రమ కట్టడాలను నిర్మించడంతో మున్సిపల్‌ కాలువలకు రక్షణ కరువైంది. పట్టణంలో అసలే అంతంతమాత్రంగా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు కాలువలపై అక్రమ నిర్మాణాలతో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు పెరిగిపోయాయి. వీటిని తొలగించేందుకు అవకాశం లేకుండా నివాస, వాణిజ్య గృహ యజమానులు మునిసిపల్‌ కాలువలను ఆక్రమించి తమ భవన నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ప్రారంభ దశ నుండే పర్యవేక్షణ చేయాల్సిన టౌన్‌ ప్లానింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులు, సంబంధిత ఆయా వార్డు సచివాలయాల టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శులు కనీసం పట్టించుకోకపోవడంతో భవననిర్మాణ యజమానులు బరితెగించి మరీ కాలువలపై పలకలను, రేకు షెడ్లను వేసి అక్రమ కట్టడాలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది కలిగి ట్రాఫిక్‌ సమస్య కూడా కలుగుతుంది. ఈ ఆక్రమణల వల్ల భారీగా కురిసే వర్షపు నీరు మురుగు కాలువలలోకి వెళ్లేందుకు అవకాశం ఉండడంలేదు. దీంతో మురుగు నీరు, వర్షపు నీరు ఏకమై రోడ్లపైనే ప్రవహించే అవకాశాలు ఉండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత జఠిలం కానుంది. కావున టౌన్‌ ప్లానింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులు ముందస్తుగా కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి కాలువల్లో ఉన్న పూడికలను తొలగించేందుకు చర్యలు చేపడితే వర్షపు నీరు మురుగు కాలవల ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ఈ సమస్య పరిష్కారానికి ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.