Jul 20,2023 20:02

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం శ్రేణులు

ప్రజాశక్తి - వినుకొండ : వెన్నపూస వాగు కాలనీలో అధికార పార్టీ చెందిన వ్యక్తులు అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ పార్టీ కార్యాలయం నుండి సురేష్‌ మహల్‌ రోడ్డు మీదగా తహశీల్ధార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అక్రమంగా నిర్మాణాలపై మున్సిపల్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. అధికార వైసిపికి చెందిన పిడతల ఏసుబాబు, పిడతల అన్నబాబు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, గత నెలలో నిర్మాణం చేపట్టేందుకు యత్నించడంతో వివాదం తలెత్తి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా తహశీలాదర్‌ ద్వారా పరిష్కరించుకోవాలని వారు సూచించారని చెప్పారు. తహశీల్దార్‌కు 'స్పందన'లో ఫిర్యాదు చేయగా కొలతలు వేసి అది ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? అనేది నిర్థారిస్తామని తహశీల్దార్‌ చెప్పారని తెలిపారు. అయినా సరైన చర్యల్లేవని, అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముని వెంకటేశ్వర్లు, నాసర్‌ బి, రంజాన్‌ బి, తిరుమల లక్ష్మి పాల్గొన్నారు.