Jun 16,2023 17:58

టాస్క్ ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

అక్రమ మైనింగ్, రేషన్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం
నకిలీ విత్తన మాఫియాను అరికట్టండి
నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయండి.
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి.
ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించండి.
సంబంధిత అధికారులను జిల్లా  కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి.
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

     జిల్లాలో అక్రమ మైనింగ్, రేషన్ బియ్యం రవాణా, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల నియంత్రణకై బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా  కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అక్రమ మైనింగ్, రేషన్ బియ్యం రవాణా,నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల నియంత్రణపై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, డిఆర్ఓ పుల్లయ్య తదితర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ అక్రమ మైనింగ్, రేషన్ బియ్యం రవాణా, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల నియంత్రణకై బ్లాక్ స్పాట్లను గుర్తించి టాస్క్ ఫోర్స్ బృందాలచే విస్తృత తనిఖీలను నిర్వహించాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై  పీడీ యాక్ట్ అమలు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్, మైనింగ్, సివిల్ సప్లై, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటై గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీచేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏర్పాటుచేసిన కమిటీలు సరైన రీతిలో పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు  టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి అక్రమ నిర్వాహకులపై ఉక్కు పాదం మోపాలన్నారు. గ్రామ మండల స్థాయి బృందాల్లో రెవెన్యూ, పోలీసు, సంబంధిత అధికారులు ప్రతి రోజు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో చురుకుగా పనిచేసి పై స్థాయి అధికారులకు సమాచారం ఇస్తూ తక్షణ చర్యలు గైకొనాలన్నారు. ఏదేని శాఖలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే సంబంధ అధికారులు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించండి .
ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు దిగుబడులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నకిలీ విత్తనాల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని... లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలను బాధ్యులను చేస్తామని సియం వెల్లడించినట్లు కలెక్టర్ తెలిపారు. నకిలీ విత్తనాలు, రసాయనక ఎరువులు, పురుగుమందులు తదితర వాటిల్లో అక్రమాలు జరగకుండా ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి వాస్తవ నివేదికలు అందజేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని వచ్చే రెండు నెలలు కీలకంగా వ్యవహరించి చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమ రవాణా, నకిలీ విత్తనాలు, రసాయనిక ఎరువుల నిల్వలు తదితర అంశాలపై మీడియాకు సమాచారం అందిస్తూ.... అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో మీడియాను కూడా భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ రవాణా, రైతాంగం నష్టపోకుండా తీసుకోవాల్సిన అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని  ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎస్పిని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు ముందుకొచ్చి పోలీసులకు సమాచారమిచ్చి సహకరించాలని ఆయన కోరారు. అనంతరం సంబంధిత అధికారులు అక్రమ అసాంఘిక కార్యకలాపాలపై తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ సమావేశంలో మైనింగ్, ఇరిగేషన్, సివిల్ సప్లై, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.