రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపాలని గిరిజన సంఘం ఆందోళన
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలకు తూట్టు పొడుస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రెవెన్యూ సర్వేనెంబర్ 102/1ఎలో 3.62 ఎకరాల భూమిని బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో చదును చేస్తుండగా గిరిజన సంఘం నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలను అతిక్రమిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భోగవల్లి ప్రసాదరావు సర్వే నెం 102/1ఎలో 3.62 ఎకరాల్లో కొబ్బరి తోట ఉందన్నారు. ఆ భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్లు ఏర్పాటు చేశారన్నారు. జంగారెడ్డిగూడేనికి చెందిన సింహాద్రి బ్లేడ్ ట్రాక్టర్‌ను లేఅవుట్ ప్రాంతాన్ని చదును చేసేందుకు పంపించారన్నారు. లక్ష్ముడుగూడెం పంచాయతీ ఉప సర్పంచి పదవిలో ఉంటూ ఈ ప్రాంతంలో భూమిని ఇళ్లస్థలాలుగా అమ్మేందుకు అక్రమంగా లేఅవుట్ చేయడం బాధాకరమన్నారు. దీనిపై తహశీల్దార్‌కు సమాచారం అందించగా విఆర్‌ఒ ఆశాబిను పంపించారు. విఆర్‌ఒ అక్కడకు చేరుకుని వివరాలు తెలుసుకని అక్కడ నుంచి ట్రాక్టర్‌ను పంపించివేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కారం భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తామా ముత్యాలమ్మ పాల్గొన్నారు.










