Sep 12,2023 21:46

దీక్షలకు సంఘీభావం తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ :  మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్‌ అక్రమ లాకౌట్‌ను అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు వ్యతిరేకించాలని జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జ్యూట్‌ మిల్లు కార్మికులు చేపడుతున్న నిరసన దీక్షకు మద్దతుగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం జెఎసి ప్రతినిధులు మాట్లాడుతూ యాజమాన్యం అన్యాయంగా జ్యూట్‌ మిల్లును లాకౌట్‌ వేసి నేటికి 15 నెలలు కావస్తున్నా స్థానిక మంత్రి గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడంలేదన్నారు. ఇంకా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి అక్రమంగా మూసి వేసిన జ్యూట్‌ మిల్లును తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్‌లో ప్రజలందరితో కలిసి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంఘాలు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మిల్లు మూతపడి 14 నెలలు కావస్తున్నా నేటికి అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లాలో ఒకే ఒక్క జ్యూట్‌ మిల్లు జిగిరాం మిల్లు అని, అటువంటి మిల్లులో సుమారు రెండు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, వీరంతా నేడు ఉపాధికి సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని, తక్షణమే ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి మిల్లును తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో జెఎసి ప్రతినిధులు సిద్దా బత్తుల సింహాచలం, పువ్వుల శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు.