Jul 24,2023 22:55

క్వారీల్లో వాహనాలను స్వాధీనం చేసుకున్న డిఎస్‌పి కిరణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - పొందూరు: మండలంలోని రాపాక పంచాయతీ పరిధి ఇల్లయ్యగారిపేట సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌పి సురేష్‌బాబు ఆదేశాల మేరకు డిఎస్‌పి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఎటువంటి అనుమతులు, లీజులు లేకుండా సర్వే నంబర్‌ 332, 98లో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్వారీల్లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ క్వారీల్లో ఎవరికి లీజులు ఉన్నాయి?, ఎవరికి అనుమతులు ఉన్నాయన్నది గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ జియాలజిస్టు సురేష్‌కుమార్‌, పొందూరు ఎఎస్‌ఐ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.