Nov 03,2023 22:05

ప్రజాశక్తి వార్తకు స్పందన
   ముదినేపల్లి : ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ప్రధాన ఆర్‌అండ్‌బి రహదారికి అడ్డంకిగా నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగింపచేశారు. వివరాల్లోకి వెళితే వడాలి - తామరకొల్లు ఆర్‌అండ్‌ బి రహదారులో మండలంలోని పెదకామనపూడి వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి రహదారిని ఆక్రమించి అక్రమ కట్టడం నిర్మించాడు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యపై గత నెల 22వ తేదీన ప్రజాశక్తిలో 'అక్రమ కట్టడం తొలగించాలంటూ' వార్త వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ వార్తకు స్పందించిన ఆర్‌అండ్‌బి అధికారులు గత నెల 25వ తేదీన ప్రధాన రహదారులో నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించారు. ఈ సమస్య పరిష్కారం కావడంతో ఇటు గ్రామస్తులు, అటు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.