
అధికారులకు విన్నవించినా ఫలితం లేదు
గ్రామస్తుల ఆవేదన
ప్రజాశక్తి - ముదినేపల్లి
ప్రధాన రహదారిపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు వెంటనే తొలగించాలని మండలంలోని పెదకామనపూడి గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. వివరాల్లోకెళితే వడాలి - తామరకొల్లు ఆర్‌అండ్‌బి రహదారిలో వెదకామనపూడి వద్ద రహదారిని ఆక్రమించి, గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమ కట్టడం నిర్మాణం చేస్తున్నాడు. ఈ అక్రమ కట్టడం నిర్మాణం వల్ల గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాక రహదారిపై వాహనాల రాకపోకలకు కూడా ఈ కట్టడం అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నిర్మాణం చేస్తున్న అక్రమ కట్టడం తొలగించాలంటూ పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలంటూ సంబంధిత అధికారులను పెదకామనపూడి గ్రామస్తులు కోరుతున్నారు.