Jun 17,2023 20:47

నివాళులర్పిస్తున్న ఛైర్మన్‌, కమిషనర్‌

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లను తట్టుకొని అక్రమ కట్టడాలకు కూల్చివేతకు అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ కన్యాకుమారి నడుం బిగించారు. ఆమె చేపట్టిన ఈ చర్యలను ఆదోని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో రోజురోజుకు పెరుగుతున్న అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మించుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు సాగి అనేక అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. 11 ఏళ్ల క్రితం సేవలందించిన పూర్వపు కమిషనర్‌ కన్యాకుమారి ఇక లేరన్న వార్త తెలిసి ఆదోని ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న పూర్వపు కమిషనర్‌ కన్యాకుమారి శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆదోని మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ బోయ శాంత ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ఛైర్మన్‌ బోయ శాంత, కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. కన్యాకుమారి ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌గా రెండు పర్యాయాలు విధులు నిర్వహించారు. 2012లో ఆదోనిలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కన్యాకుమారి 2013లో పట్టణంలోని అక్రమ కట్టడాల తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని శ్రీనివాస భవన్‌ యాజమాన్యం పక్కనే ఉన్న ఇద్రూస్‌ బావిని ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తొలగించి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఆమె సేవలతో ఆదోనిలో రికార్డు సృష్టించారు. ఎమ్మిగనూరు టర్నింగ్‌లోనూ, చందా సాహెబ్‌ దర్గా ప్రాంతంలోనూ అనేక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి తొలగించి కూల్చివేతలు చేపట్టారు. అలాగే పట్టణంలోని అనేక మున్సిపాలిటీ స్థలాలను గుర్తించి అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా తొలగించి మున్సిపాలిటీకి స్వాధీనం చేసే విధంగా చర్యలు చేపట్టారు. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలనను సుదీర్ఘంగా 20 గంటల పాటు చేపట్టి అనర్హులు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు. ఆమె ధైర్యాన్ని పలువురు ప్రశంసించారు. అప్పట్లో కన్యాకుమారి చేసిన సేవలను గుర్తించుకొని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోని కమిషనర్‌గా కన్యాకుమారిని నియమించి అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదోనిలో 2020లో చేరిన కమిషనర్‌ కన్యాకుమారి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆరు నెలల్లోనే ఇక్కడి నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న ఆమె చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందారు.