Jun 19,2023 20:55

నిర్మాణాలను పరిశీలిస్తున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

పీలేరు : పీలేరు శ్రీకష్ణ దేవరాయులు నూనె విత్తుల కర్మాగారం ప్రభుత్వ స్థలంలో పరిమితికి మించి చేపట్టిన అక్రమ ఇళ్ల నిర్మాణాలను ఆపాలని జిల్లా సంయుక్త పరిపాలన అధికారి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తహశీల్దారు కె. ధనుం జయులును ఆదేశిం చారు. సోమవారం సాయంత్రం జెసి నూనె విత్తుల కర్మాగారం ఆవరణంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. నూనెవిత్తుల కర్మాగారం ఆవరణంలో అధికార పార్టీ నాయకుల అండదం డలతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టిడిపి జాతీయ నేత నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆరోపించారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ నూనెవిత్తుల కర్మాగారం ఆవరణంలోని గూడరేవుపల్లి గ్రామ సర్వే నెంబర్‌ 198లో ఇళ్ల నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. రెవెన్యూ శాఖ నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్నారని తన పరిశీలనలో తేల్చారు. అనంతరం ఆక్రమణదారులు పగలగొట్టిన నూనెవిత్తుల కర్మాగార ప్రహరీని పరిశీలించారు. ఇక్కడ దారి ఏర్పాటుకు అనుమతి ఎవరిచ్చారని అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జెసి వెంట స్థానిక రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.