Nov 01,2023 23:56

అక్రమ కట్టడాల నిర్మాణాలు వద్దు..

అక్రమ కట్టడాల నిర్మాణాలు వద్దు..
- చెంగారెడ్డిపల్లి గిరిజనుల ధర్నా
- కబ్జా నుండి కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి
- సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ
నాయకుల మద్దతు

ప్రజాశక్తి -రేణిగుంట: గిరిజన భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాల నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తమకు రక్షణ కల్పింఇ తమ భూములు తమకే అప్పగించాలని కోరుతూ చెంగారెడ్డి పల్లి గిరిజనులు బుధవారం అక్రమ నిర్మాణాలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు సీపిఎంతో పాటూ పలు వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చెందిన చెంగారెడ్డి పల్లి గిరిజనుల ఇంటి స్థలాలు కోసం గిరిజన సేవ సంఘం భవనం అవసరాల కోసం సర్వే నెం.538/1బి2బి, 538/1బి2సి ప్రభుత్వ అనాధీనం 2 ఎకరాల 1 సెంటు భూమి కేటాయించారు. ఇప్పటి రేణిగుంట రెవెన్యూ అడంగల్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 17వ తేదీ తీసిన మీ భూమి అడంగల్‌ రిపోర్ట్‌లో ఉన్నాయని రేణిగుంట మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి గత నెల 28వ తేదీ శ్రీకాళహస్తికి చెంగారెడ్డిపల్లి గిరిజన యువకులను పిలిచి వారి సమస్యను తెలుసుకొని 60 మందికి ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చార న్నారు. మీ గ్రామంలో భూమి సర్వే చేసి, ఫ్లాట్లు వేసి, రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ పోల్స్‌ ఏర్పాటు అధికారుల ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి తాము సహకారం అందిస్తానని గిరిజనులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో నిరసన దీక్ష తాత్కాలికంగా తొలగించారు. అయితే గిరిజన భూముల్లో రెండు రోజులుగా అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో బుధవారం గిరిజనులు అక్రమ కట్టడాల పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన భూ కబ్జా దళారి రామ్మూర్తి గిరిజనుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌ సీఐకు ఫోన్‌ చేసి రామ్మూర్తి తరపున పోలీసులను పిలిపించు కొని గిరిజనులను భయపెట్టే ప్రయత్నం చేశారని, అయినప్ప టికీ గిరిజనులు ఎదురు తిరిగి అక్రమ కట్టడాలు కడుతున్న చెంగారెడ్డిపల్లి గ్రామం వద్ద షామియానాటెంటు వేసుకుని ధర్నా చేపట్టారు. గిరిజనుల పోరాటానికి మద్దతుగా సిపిఎం మండల కార్యదర్శి కె హరినాథ్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరత్నం, ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యురాలు గంగాదేవి, రేణిగుంట కెవిపిఎస్‌ మండల కార్యదర్శి కె. సెల్వరాజ్‌, గిరిజన సేవ సంఘం అధ్యక్షులు విజయబాబు, గిరిజన సంఘం కార్యదర్శి సంపూర్ణ, లక్ష్మీ, సుశీల, రేణుకమ్మ పాల్గొన్నారు.