ప్రజాశక్తి-హిందూపురం : అక్రమ కేసులకు జనసేన నాయకులు భయపడే ప్రసక్తే లేదని జనసేన నాయకులు అన్నారు. కర్నాటక రాష్ట్రం బాగేపల్లిలో గత నెల 29న అక్రమ కేసు నమోదు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన ఇన్‌చార్జ్ ఆకుల ఉమేష్, చిలుమత్తూరు మండల అధ్యక్షుడు చిన్న ప్రవీణ్ మాట్లాడారు. 20 రోజుల క్రితం ఓ మోసకారి మాటలు నమ్మి జనసేన పార్టీ నాయకులపై అధికార పార్టీ నాయకులు కర్నాటక పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు బనాయించడం హేయమైన చర్య అని అన్నారు. కదిరి నియోజకవర్గానికి చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి మాంగల్య సిల్క్ హౌస్‌కు లోను ఇప్పిస్తానని చెప్పి రూ.3 లక్షలు నగదు తీసుకున్నాడన్నారు. సకాలంలో లోన్ ఇప్పించక పోవడంతో ఆయనపై ఆరా తీస్తే అతనను మోసం చేసినట్లు తెలుసుకున్నామన్నారు. ఈనేపథ్యంలో కర్నాటక సరిహద్దులో బాగేపల్లి వద్ద ఒక రెస్టారెంట్ దగ్గర రమేష్ బాబు కనిపించగా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని అడిగితే ఇచ్చేదే లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి వాగ్వాదానికి దిగాడన్నారు. దీంతో బాగేపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. రెండు నెలల్లో డబ్బులు ఇస్తానని రాతపూర్వకంగా రాసి ఇచ్చారన్నారు. రమేష్ బాబుకు హిందుపురం నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అండగా నిలుస్తూ తమపై లేనిపోని నిందలు వేసి బాగేపల్లి పోలీస్ స్టేషన్‌లో తమపైనే అక్రమంగా కేసు నమోదు చేయించి ఎఫ్‌ఐఆర్ చేశారని విమర్శించారు. తమకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే హైకోర్టుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు శేఖర్, నాయకులు రమణ, భాస్కర్, అంజినేయలు, లక్ష్మణ మూర్తి, నవీన్ ప్రభు, నాగభూషణ, కిషోర్, మనిప్రియ, శేఖర్ కన్నా, హనుమంతు, గాజుల నాగభూషణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










