బైటాయించిన రూరల్ ఎంఎల్‌ఎ
అక్రమ కేసులకు -అరెస్టులకు తగ్గేదేలే..!
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో పోలీసుల సహకారంతో అక్రమ కేసుల నమోదు చేయించడం.. హౌస్ అరెస్టులు చేయించడం.. వంటి అధికార పార్టీకి చెందిన నాయకుల కుట్రలకు.. కుతంత్రాలకు తాము అదిరేది.. బెదిరేది లేదని.. ఏ మాత్రం తగ్గేదే లేదని టిడిపి నాయకులు పేర్కొన్నారు. సోమవారం టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఛలో మినగల్లు కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భగం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు రూరల్ ఎంఎల్‌ఎ కార్యాలయం వద్ద వారిద్దరిని అడ్డుకున్నారు. పోలీసు చర్యలకు నిరసనగా రహదారిపై టిడిపి నాయకులు బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు న్యాయబద్దంగా వ్యవహరించాలని, ముందస్తు నోటీసులు అందజేయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. అధికార పార్టీ నాయకుల వత్తిడికి లోబడి పోలీసులు అక్రమ అరెస్టులతో, అక్రమ కేసులతో, ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరన్నారు. విద్యార్ధి దశ నుంచి అనేక అరెస్టులు, పోలీసు లాఠీల దెబ్బలు తిన్నామని, తమకు కొత్తేమి కాదన్నారు. పోలీసు లాఠీలు, తూటాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో ఎన్ని పెట్టినా ప్రజా సమస్యల పరిస్కారం కోసము. రెట్టించిన ఉత్సాహంతో మరింతగా పని చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసిపి పాలనతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, రాష్ట్రంలో రానున్నది టిడిపి పాలన అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇసుక ధర గతంలోలాగా అతి తక్కువ ధరకే వస్తుందన్నారు. రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక ధరను ఇష్టానుసారంగా పెంచి, 4 రెట్లు, 5 రెట్లు పెంచారన్నారు. ఒకలోడు ఇసుకకు 6 వేలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు పోవటం లేదు. ఎవరి జేబులోకి పోతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల ఇసుక దోపిడిని ప్రశ్నిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చినా, సుప్రీమ్ కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లు దొడ్డపనేని రాజా నాయుడు, జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, తాటి వెంకటేశ్వర రావు, కార్పొరేటర్లు బీమినేని మురహరి, చేజర్ల మహేష్, బద్దెపూడి నరసింహ గిరి, క్లస్టర్ ఇంఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, సాబీర్ ఖాన్, మన్నేపల్లి రఘు, సారంగం గున్నయ్య, షంషుద్దీన్, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, సురేంద్ర, అళహరి విజరు, నెల్లూరు మురళీ నాయుడు, కటకం చైతన్య, యానాది రెడ్డి, కోటిరెడ్డి, యోగానందం, కనపర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.










