టి.నరసాపురం : తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని మల్లప్పగూడెం గ్రామంలో అక్రమ చేపల చెరువులను తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం చెరువులను వ్యకాస నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలను పాడుచేసి చేపల చెరువులు యథేచ్ఛగా తవ్వకాలు చేసి చేపలు పెంచుతున్నారని అన్నారు. గ్రామచేపల చెరువులో చేపలకు మేత బదులు కోళ్ల వ్యర్థాలు, చనిపోయిన కోళ్లను వేస్తున్నారని తద్వారా దుర్వాసన వస్తుందన్నారు. వాటివల్ల తిన్నవారు అనారోగ్యాలకు గురవుతారని ఆందోలన వ్యక్తం చేశారు. వ్యర్థాలు వేయొద్దని చుట్టుపక్కల ఉన్న స్థానిక గిరిజనులు చిన్న సన్నకార రైతులు అనేకసార్లు చేపల చెరువు యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నాయకులు మడకం సుధారాణి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిన్న సూరిరావు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.










