ప్రజాశక్తి - గుంటూరు : ఉపాధ్యాయినిని డిఇఒ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించటమే కాకుండా, పై అధికారుల ఉత్తర్వుల లేకుండా నగరంలోని వేరొక పాఠశాలలో నియమించటంపై విద్యాశాఖలో కీలక అధికారులపై వేటు పడింది. గుంటూరు ఎంఇఒ ఖుద్దూస్, ప్రస్తుత పల్నాడు డిఇఒ ఆఫీసు సూపరింటెండెంట్, గతంలో గుంటూరు డిఇఒ సిసిగా పనిచేసిన నరసింహారావు సస్పెండ్ అయ్యారు. పిడుగురాళ్ల మండలంలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ నాగరాజకుమారిని డిఇఒ కార్యాలయంలో ఎపిఒగా నియమించారు. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో అమెను తాడికొండ ఎఎ ఎంపిపి పాఠశాలకు బదిలీ చేశారు. ఈ నియామకం నిబంధనలకు విరుద్దం. సదరు ఉపాధ్యాయురాలు మొదట పనిచేసిన పిడుగురాళ్ల స్కూల్ హెచ్‌ఆర్‌ఎ కేటగిరీ 3 కిందకు వస్తుంది. తాడికొండ కేటగిరీ 1 కిందకి వస్తుంది. ఒక ఉపాధాయురాలిని బదిలీ చేయాల్సి వస్తే అదే హెచ్‌ఆర్‌ఎ కేటగిరీ ఉన్న పాఠశాలకే బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే సదరు ఉపాధ్యాయురాలు తాడికొండ పాఠశాలలో చేరకపోగా, కనీసం అక్కడి ఎంఇఒకు కూడా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఆరు నెలల తర్వాత హటాత్తుగా గుంటూరు, అన్నపూర్ణ నగర్‌లోని ఎఎన్ ఎంపిపి పాఠశాలకు వెళ్లి రిపోర్ట్ చేశారు. ఈ బదిలీల్లో ఎక్కడా జిల్లా అధికారుల ఉత్తర్వులు లేకపోవటం గమనార్హం.
ఉత్తర్వులు లేకున్నా, జిల్లా అధికారుల ఉత్తర్వుల లేకపోయినా గుంటూరు ఎంఇఒ ఆమెను పాఠశాలలో చేర్చుకోవాలని పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారని, అంతేకాకుండా మెడికల్ లీవు కూడా మంజూరు చేశారని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయం బయటికి పొక్కటంతో అప్పటికప్పుడు డిఇఒ సంతకాలు ఫోర్జరీ చేసి, ఉత్తర్వులు సృష్టించారనే ఆరోపణలూ వచ్చాయి. సదరు ఉపాధ్యాయురాలి డెప్యుటేషన్ ప్రక్రియ మొత్తం అక్రమమని ప్రజాశక్తిలో ఏడాది క్రితమే కథనం ప్రచురితమైంది. స్పందించిన పాఠశాల విద్య కమిషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. పాఠశాల విద్య ఆర్‌జెడి, గుంటూరు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, నివేదిక ఇచ్చారు. అయితే సంబంధిత అధికారులు కొందరు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించి, చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణులు వచ్చాయి. ఈ క్రమంలో సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే తేల్చి ప్రస్తుతం సస్పెండ్ చేశారు. కోర్టు కేసులపై స్పందించకపోవటం, ఎయిడెడ్ యాజమాన్యాల ఫిర్యాదులు తదితర అంశాలకు సంబంధించి ఎంఇఒపై ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం చర్యలు ప్రారంభమైనందున ఈ విషయంలో హస్తం ఉన్న మరికొందరిపైనా తర్వాత చర్యలుంటాయని తెలుస్తోంది. అప్పటి డిఇఒ, ఏడీలకు కూడా ఇందులో భాగం ఉందనే ఆరోపణలున్నాయి. కీలక అధికారులపై వేటు వేయటంతో విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.










