కడప అర్బన్ : సాధారణ బదిలీల అనంతరం బ్లాక్ చేసిన పోస్టులలో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు తెలిపారు. గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఆలయం ఎదుట అక్రమ బదిలీలను ఆపాలని, బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో దొడ్డిదారి బదిలీలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల 15 మందికి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని, మరి కొంతమంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సామాన్య ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మారుమూల పనిచేసే ఉపాధ్యాయులు సర్వీస్ మొత్తం మారుమూల ప్రాంతాల్లోనే పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విధానాలను పాలకులు తుంగలో తొక్కి వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో వివిధ పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్ సమస్యల వల్ల జీతాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. దీనిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. బదిలీలు, ఉద్యోగోన్నతుల వల్ల దాదాపు 40 శాతం మంది ఉపాధ్యాయులు ఈనెల జీతాలు అందుకోలేకపోయారని తెలిపారు పిజిటిలుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్లు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారని, డిఇఓ ఫూల్‌లో ఉన్న ఎల్‌పిలకు కూడా జీతాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా మారిన పాఠశాలలకు డిడిఓ కోడ్స్ లేని కారణంగా వారికి జీతాలు ఆలస్యం అవుతున్నాయని పేర్కొ న్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులను తొలగించిన కారణంగా ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా జీతాలు చెల్లించే మార్గద ర్శకాలు ఇవ్వాలని కోరారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు మరింత తీవ్ర స్థాయిలో జరిపి ప్రభుత్వం మెడలు వంచైనా సాధించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర కౌన్సిలర్ రూతు ఆరోగ్యమేరీ, నాయకులు గోపీనాథ్, కిరణ్ కుమార్, డేవిడ్, అబ్దుల్ గనీ, జావిద్, శ్రీనివాసులు, కరిముల్లా, సుబ్బారావు, సిద్దయ్య, అనిల్, సునీల్ కుమార్, కిరణ్ కుమార్, వనమాల రాము, ఓబులేసు, గురు మోహన్, రాజశేఖర్, కత్తి రామాంజనేయులు, సుబ్బారెడ్డి, సూర్యకుమార్, గణేష్ బాబు పాల్గొన్నారు.










