కడప అర్బన్ : ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు నిర్వహించి రెండు నెలలు గడవకముందే తమ అనుమాయులకు, పైరవీకారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వ హించడం పారదర్శకత పాలనలో భాగమా అని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా ప్రభు త్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ బదిలీలను నిరసిస్తూ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డిఇఒ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బి.లక్ష్మీ రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ తమ పాలన పారదర్శకతకు మారుపేరని పదేపదే ప్రకటించుకునే రాష్ట్ర ప్రభుత్వం, కొందరు ఉపాధ్యాయుల పైరవీలకు తలొగ్గి కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ ఆర్థిక, రాజకీయ పలుకుబడి కలిగిన తమ అస్మదీయులు, అనుమాయులైన కొందరు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వులతో దొడ్డి దారిన అక్రమ బదిలీలు నిర్వహించడం దుర్మార్గ మన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్ విధా నానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న సిఫార్సు బదిలీల వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో కేటగిరి 1, 2లలోని కొన్ని స్థానాలను బ్లాక్ వాటిని ఇప్పుడు సిఫార్సు బదిలీల ద్వారా భర్తీ చేయడం సిగ్గుచేటన్నారు. సాధారణ బదిలీలలో మారుమూల ప్రాంతాలలోని ఖాళీలు భర్తీ కాకుండా విద్యార్థులు నష్టపోతారని నీతులు చెప్పిన ప్రభుత్వం, పట్టణ ప్రాంతాల్లోని కేటగిరి 1, 2 ఖాళీలను బ్లాక్ చేసి ఇప్పుడు సిఫార్సు బదిలీలతో భర్తీ చేయడం ద్వారా తన నైజాన్ని బయట పెట్టిందని ఎద్దేవ చేశారు. మాటిమాటికి సిఫార్సు బదిలీల ద్వారా పట్టణ ప్రాంతాలలోని ఖాళీలను భర్తీ చేస్తే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాల్లోనే ఉండిపోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. సాధారణ బదిలీలకు ముందు నుంచి అక్రమ బదిలీలను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ 75 మందికి సిఫార్సు బదిలీలు చేపడుతూ డిఇఒలకు రహస్య ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తక్షణమే సిఫార్సు బదిలీలను రద్దుచేసి తమ పారదర్శకతను, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిఫార్సు బదిలీలను ఉపస ంహరించుకోకపోతే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, నాయకులు సుబ్బారెడ్డి, గోపీనాథ్, కరీముల్లా, కిరణ్ బాబు, శివశంకర్, జి. వెంకటసుబ్బయ్య, కొండయ్య బాబు, సూర్య కుమార్, అబ్దుల్, గని ప్రకాష్ బాబు, విశ్వనాధ్, సాగర్, జానకి, రామ్, శశిధర్, హమీద్ పాల్గొన్నారు.










