Jul 06,2023 23:59

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు అప్పలనర్స

ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌....
ప్రజాశక్తి -పాడేరు
:అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎలో గిరిజన సంక్షేమ గ్రేడ్‌-టూ హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ఓ మాయాజాలంలా ఉందని, ఈ అక్రమ బదిలీ లను తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనర్స, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ అక్రమ బదిలీల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు, ఐటిడిఎ పిఒ, గిరిజన సంక్షేమ డిడిలకు ఫిర్యాదు చేశారు.
బదిలీల నిషేధం అమలులో ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నచ్చిన వారికి నచ్చిన చోటుకు, నచ్చిన సమయంలో అడ్డగోలుగా పోస్టింగులు ఇచ్చారని ఆరోపించారు. బదిలీల సమాచారం ఇచ్చేందుకు డిడి కార్యాలయం అధికారులు వెనకంజ వేస్తున్న తీరు సైతం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మే 22 నుంచి 30 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా టిడబ్ల్యూ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరిగింద,. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేశారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఒకే చోట రెండేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులు రిక్వెస్ట్‌ ప్రాతిపదికన బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. మే 30న ఐటిడిఎ సమావేశ మందిరంలో టీడబ్ల్యూ హెచ్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్‌ డిడి ఐ.కొండలరావు, కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమక్షంలో నిర్వహించారన్నారు. ఐదుగురు హెచ్‌ఎంలు కౌన్సెలింగ్‌కు హాజరైనప్పటికీ ఎక్కడా కోరుకోకుండానే వెళ్లిపోయారన్నారు.
అయితే మే నెల 30న బదిలీలు ముగియడంతోపాటు అర్ధరాత్రి నుంచే బదిలీల నిషేధం అమలులో ఉన్నప్పటికీ నియంతత్వ ధోరణితో జూలై నెల మొదటి వారంలో ఆ ఐదుగురు హెచ్‌ఎంలకు తాటిపర్తి, హుకుంపేట, పెదబయలు, జికె.వీధి, భీంపోలు పాఠశాలలకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సష్టించిందన్నారు. ఆ ఐదుగురు బదిలీల తంతుపై ఉపాధ్యాయుల్లో తీవ్రమైన చర్చ సాగుతోందన్నారు. టిడబ్ల్యూ విద్యాశాఖలోని ఓఉన్నతాధికారితో పాటు జిల్లాలోని ఉన్నతాధికారి సిఫారసుతోనే ఆ ఐదుగురు హెచ్‌ఎంలకు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోందన్నారు.
సిఫారసు బదిలీల్లో డిడి కార్యాలయంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బరితెగించి ఇచ్చిన అడ్డగోలు బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ ఐదుగురు హెచ్‌ఎంల బదిలీ వెనక జరిగిన అక్రమ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ అడ్డగోలు బదిలీల వ్యవహారంలో టిడబ్ల్యూ టీచర్స్‌ యూనియన్‌ తో పాటు ఇతర టీచర్స్‌ యునియన్‌ నాయకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. జిఒ3 కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వంపై తమ గిరిజన సంఘం ఒత్తిడి మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ స్వీకరించిన అనంతర ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారిని మైదానానికి, మైదానం ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతానికి టీచర్లను బదిలీ చేయడం, నియమించడం ఆదివాసీల హక్కుల, చట్టాల పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.