ప్రజాశక్తి-రాజవొమ్మంగి
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేసేందుకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేయగా, ప్రభుత్వం తొలిత అనుమతి ఇచ్చి తరువాత అక్రమంగా అరెస్టు చేయడంపై యుటిఎఫ్ ఆధ్వర్యాన గురువారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఎటుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా, మండల నాయకులు ఎస్.రాజబాబు, ఎం.మనోహర్, ఎం.రమేష్ బాబు, డి.పైడిమల్లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాస్తున్న సేవింగ్స్ నుంచి ఉద్యోగుల అవసరాల కోసం లోన్లు పెట్టుకుంటే సకాలంలో చెల్లించాలని కోరగా, ప్రభుత్వం స్పందించలేదన్నారు. కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలకు ఆహ్వానించకపోగా నిన్నటి నవంబర్ 30న విజయవాడ రాష్ట్ర ధర్నాకు ఉపాధ్యాయులను రాకుండా అడ్డుకుంటున్న తీరు ఎలాంటి ప్రజాస్వామ్యమో ప్రభుత్వం చెప్పాలన్నారు. మా సొమ్ము మాకు తిరిగి ఇవ్వటానికి ఇంత తాత్సారం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి అక్రమంగా బైండోవర్ చేయటం, కాపలాలు పెట్టడం, పాఠశాలల కెళ్ళి నోటీసు ఇవ్వటం సరైన విధానం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను చెల్లించాలని, ఉపాధ్యాయులపై పెడుతున్న బైండోవర్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు పరిశిక సుబ్బారావు, బి వెంకటలక్ష్మి, పి రమణ, పి సత్యనారాయణ, ఎం ఉదరు, గుమ్మడి సూర్యనారాయణ, నానాజీ, లింగటి కొండబాబు, కాయితి లక్ష్మణరావు, గడుతురి త్రినాధ్, బేబమ్మ, సింగిరెడ్డి సత్యనారాయణ, పాల్గొన్నారు.










