May 24,2023 23:52

రైతును అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-గుంటూరు : రాజధాని ప్రాంతంలో రైతు సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న నాయకులను, తుళ్లూరు దీక్షా శిబిరంలోని కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. రాజధానిలో సిఎం సభ పేరుతో నాయకుల్ని అక్రమ అరెస్టు చేయడం తగదని, సమస్యలపై నిరసన తెలియజేయడం, ఆందోళన చేయడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కని గుర్తు చేశారు. ఈ హక్కును కాలరాయటం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను గందర గోళపరచకుండా ఏ గ్రామంలోని పేదలకు ఆగ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తాడేపల్లి పట్టణంలో 40 ఏళ్ల నుండి ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వకుండా వారికి ఇళ్ల స్థలాలు రాజధానిలో ఇస్తామని ప్రచారం చేయడం తగదని విమర్శించారు. పెదకాకాని మండలం ఎన్‌టిఆర్‌ కాలనీలో 30 ఏళ్లుగా 400 కుటుంబాలు ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నాయని, వారిని 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చిందని, ప్రజలకు ఉపాధి లభించే ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌లో ఆందోళన చేస్తామని ప్రకటించారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : జై భీమ్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్‌ కుమార్‌ను తుళ్లూరులో పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడాన్ని సిపిఎం రాజధాని కమిటీ ఖండిస్తున్నట్లు కమిటీ కార్యదర్శి ఎం.రవి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల నుండి తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుండగా బుధవారం పోలీసులు రైతుల ధర్నా శిబిరంలోకి చొరబడి రైతులు, మహిళలపై దౌర్జన్యం చేయటం, శ్రావణ్‌కుమార్‌ సహా రైతులను, మహిళలను దూషించడం, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని విమర్శించారు.