ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ పంచాయతీ కార్మికుల ఆకలి కేకలు ప్రభుత్వానికి, అధికారులకు కనిపించడం లేదని గన్నెవారిపల్లి పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గన్నెవారిపల్లి 1, 2 సచివాలయాల ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిసరాలను నిత్యం శుభ్రం చేసే కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వానికి మనస్సు రాలేదా.. అని నిలదీశారు. వాలంటీర్లకు అయితే నెలనెలా జీతం చెల్లిస్తారుగానీ, కార్మికులు కనిపించలేదా.. అని ప్రశ్నించారు. గన్నెవారిపల్లి గ్రామ పంచాయతీలో 29 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తుండగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అటు ప్రభుత్వానికిగానీ, ఇటు అధికారులకుగానీ కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ అధికారి రాజేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామాంజి, పంచాయతీ కార్మికులు రాజు, రామకృష్ణ, సంధ్యాభాయి, అచ్చమ్మబాయి, ఓబయ్య, కుళ్లాయప్ప, చలపతి పాల్గొన్నారు.