ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో మన దేశ స్థాయి దిగజారుతున్నది. 2020 సంవత్సరానికి 107 దేశాలకు సంబంధించి కన్‌సర్న్ వరల్డ్‌వైడ్, వెల్తంగర్ హిల్ఫే విడుదల చేసిన ర్యాంకులలో మన దేశం 94వ స్థానంలో ఉన్నది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల జాబితాలో మన దేశం బంగ్లాదేశ్ (75), పాకిస్తాన్ (88) కన్నా దిగువ స్థాయిలో ఉన్నది. రువాండా, నైజీరియా, ఆఫ్ఘనిస్థాన్, లైబీరియా, మొజాంబిక్, ఛాడ్ లాంటి 13 దేశాలు మాత్రమే మనకన్నా దిగువ స్థాయిలో ఉన్నాయి. 2015-19 మధ్య మన దేశ పరిస్థితి మరింత దిగజారింది. 2010-14 మధ్య ఎత్తుకు తగిన బరువు లేని బాలలు 15.1 శాతం ఉండగా, 2015-19 కాలంలో 17.3 శాతానికి పెరిగింది. ఒకవైపున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన ర్యాంకు పెరిగిపోతున్నదని పాలకులు డబ్బా కొట్టుకొంటుండగా మరోవైపున ఆకలి సూచీలో అట్టడుగు స్థానానికి దిగజారటం మన పాలకులు అనుసరిస్తున్న కార్పొరేట్, బహుళజాతి సంస్థల అనుకూల విధానాలను వెల్లడిస్తున్నాయి.
ఆకలిని కొలవటానికి నాలుగు కొలబద్దలను తీసుకున్నారు. ఐదు సంవత్సరాల వయసుకు తక్కువగా ఉన్న బాలలలో ఎత్తుకు తగినంత బరువు లేకపోవటం (వేస్టింగ్), వయసుకు తగినంత ఎత్తు లేకపోవటం (స్టంటింగ్), మరణాల రేటు, అవసరమైనన్ని క్యాలరీల ఆహారం తీసుకోలేకపోవటాన్ని కొలబద్దలుగా తీసుకున్నారు. ఈ అంశాలలో భారతదేశం అత్యంత తీవ్రమైన దుస్థితిలో ఉన్నది. మొత్తం మార్కులలో మూడవ వంతుకు ప్రాతినిధ్యం వహించే ఎత్తుకు తగినంత బరువు లేకపోవటం, వయసుకు తగినంత ఎత్తు లేని బాలలలో భారతదేశం ప్రపంచంలోనే దిగువస్థానంలో ఉన్నది. 2000 సంవత్సరంలో వయసుకు తగిన ఎత్తు లేని బాలలు 54 శాతం ఉండగా, ఇపుడు 35 శాతానికి తగ్గినప్పటికీ, ఇంకా దిగువ స్థాయి లోనే ఉన్నది. మరోవైపున వయసుకు తగిన బరువులేని పిల్లల విషయంలో గత రెండు దశాబ్దాలలో ఏ మాత్రం మెరుగు పడలేదు. బాలల మరణాల శాతం, అవసరమైనంత ఆహారం తీసుకోలేని వారి శాతంలో తగ్గుదల ఉన్నప్పటికీ ఆ అంశాలలో కూడా దిగువ స్థాయి లోనే ఉంది. ప్రస్తుతం బాలల మరణాల రేటు 3.7 శాతం ఉండగా, అవసరమైనన్ని క్యాలరీల ఆహారం తీసుకోలేనివారు 14 శాతం ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచం మొత్తంలో వీరి సంఖ్య 69 కోట్లు. అంటే తగినన్ని క్యాలరీల ఆహారం తీసుకోలేని వారిలో ఎక్కువ మంది మన దేశం లోనే ఉన్నారు. దక్షిణ, తూర్పు, ఆగేయాసియాలో తైమూర్ లెస్టే, ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా మాత్రమే మన దేశం కన్నా దిగువ స్థాయిలో ఉన్నాయి.
ఆకలి నిర్మూలనలో వెనుకబడ్డాం
2030 నాటికి ఆకలిని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించటంలో ప్రపంచం వెనుకబడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే 37 దేశాలు ఆహార కొరతను తక్కువ స్థాయి లోకి తగ్గించటంలో కూడా వెనుకబడతాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా ఏర్పడే పరిస్థితులను పరిగణన లోకి తీసుకోకుండా ఈ అంచనాను రూపొందించారు. దానిని కూడా పరిగణన లోకి తీసుకొంటే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది.
ఆకలిని కొలవటానికి నాలుగు సూచీలను తీసుకున్నారు. వాటికి అనుగుణంగా 0 నుండి 100 వరకు మార్కులను కేటాయించారు. మార్కుల ఆధారంగా మొత్తం దేశాలను ఐదు కేటగిరీలుగా విభజించారు. 0 నుండి 9.99 శాతం వరకు పాయింట్లు వచ్చిన వారిని తక్కువ స్థాయి ఆకలి ఉన్న దేశాలు గానూ, 10 నుండి 19.9 వరకు పాయింట్లు వచ్చిన దేశాలను మధ్య స్థాయి ఆకలి ఉన్న దేశాలుగానూ, 20 నుండి 34.9 పాయింట్లు వచ్చిన దేశాలను తీవ్ర స్థాయి ఆహార కొరత ఉన్న దేశాలుగానూ, 35 నుండి 49.9 పాయింట్లు వచ్చిన దేశాలను అత్యంత తీవ్రమైన ఆహార కొరత ఉన్న దేశాలుగానూ, 50కి పైగా మార్కులు వచ్చిన దేశాలను భయానకమైన ఆహార కొరత ఉన్న దేశాలుగానూ వర్గీకరించారు. కుటుంబాలు దరిద్రంలో ఉండటం, వైవిధ్యం లేని తక్కువ క్వాలిటీ ఆహారం తీసుకోవటం, తల్లులకు తగినంతగా విద్య లేకపోవటం సమస్య తీవ్రతకు కారణాలుగా పేర్కొన్నారు.
ఈ జాబితాలో 47 దేశాలకు 0 నుండి 9.99 పాయింట్లు వచ్చాయి. వాటిలో చైనా నాలుగవ స్థానంలో, క్యూబా ఏడవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు కాకుండా ఆకలి సమస్య తక్కువగా ఉన్న మొదటి 47 దేశాలలో 21 దేశాలు మాజీ సోషలిస్టు దేశాలు కావటం ఆసక్తికరమైన విషయం.
మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత గత ఆరున్నర సంవత్సరాలలో ఆకలి సూచీలో దిగజారుతున్నాం. 2014లో మన దేశం 17.8 పాయింట్లతో 76 దేశాలలో 55వ స్థానంలో ఉంది. అపుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు 57వ స్థానంలో మన తరువాత ఉన్నాయి. 2020కి 107 దేశాలలో మన దేశం 27.2 పాయింట్లతో 93వ స్థానానికి దిగజారగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మనకన్నా ముందు స్థానాలలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన ర్యాంకు పెరుగుతుంటే ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగుకు చేరుకుంటున్నాం. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 134వ స్థానంలో ఉన్న మన దేశం 2020 లో 63వ ర్యాంకుకు చేరింది.
దేశాభివృద్ధిని గురించి, మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ తదితరాల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్న బిజెపి పాలనలో ఆకలి సమస్య తగ్గకపోగా, మరింతగా తీవ్రమైందని ప్రపంచ ఆకలి సూచీ స్పష్టం చేస్తున్నది. దేశభక్తిని గురించి తమకు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు, తమ వ్యతిరేకులంతా దేశద్రోహులైనట్లు ప్రచారం చేస్తున్న బిజెపి, సంఘ పరివార్‌లు ప్రపంచబ్యాంకు ర్యాంకుల కోసం ప్రజలను పస్తులు పెడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు కేటాయించేది ప్రపంచబ్యాంకు. ప్రపంచబ్యాంకు మన దేశ సంస్థ కాదు. కాని మనం కూడా సభ్యులుగా ఉన్నాం, రుణాలు తీసుకుంటున్నాం కదా అని వాదించవచ్చు. రుణాలు తీసుకోవటం, అందుకోసం వారు పెట్టిన షరతులను అమలు జరపటం, వడ్డీలు, అసలు చెల్లించటం మన కార్యక్రమం మినహా వాటి విధాన నిర్ణయాలలో మనకేమీ పాత్ర ఉండదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు వాటి విధానాలను నిర్ణయిస్తాయి. అమెరికా నుండి ప్రపంచబ్యాంకుకు అధ్యక్షుడ్ని ఎన్నుకుంటే, ఇ.యు దేశాల నుండి ఐఎంఎఫ్‌కు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అటువంటి అమెరికా పెత్తనంలో ఉన్న ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో పైస్థాయికి చేరటానికి మన ప్రజలను ఆకలితో మాడ్చి చంపే విధానాలను అనుసరించటం దేశభక్తా? విదేశీ సంస్థల ఆదేశాలను అమలు చేస్తూ, బహుళజాతి సంస్థలు లాభాలను సంపాదించుకోవటానికి అమలు చేసే విధానాలతోనే మన ప్రజలకు ఆహారం అందించే విధానాలను పక్కన పెడుతున్నారు. ప్రజలకు తిండి పెట్టకుండా విదేశాలకు సంపదను దోచిపెట్టేవారు దేశభక్తులెలా అవుతారు?










