Apr 12,2023 23:59

మాట్లాడుతున్న విజయప్రతాప్‌రెడ్డి, చిత్రంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తదితరులు

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌ రెడ్డి
ప్రజాశక్తి - రంపచోడవరం

జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం పేదల ఆకలి మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సిహెచ్‌.విజయ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌, 11 మండలాలకు చెందిన సివిల్‌ సప్లై, విద్యశాఖ అధికారులు, ఐసిడిఎస్‌ సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్‌వైజర్లతో రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ సమక్షంలో విజయ ప్రతాప్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్న భోజన పథకాలకు అన్ని నిబంధనల ప్రకారం మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు ఆన్లైన్‌ ద్వారా ఎక్కడైనా రేషన్‌ తీసుకొని వెసులుబాటు ఉందని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలో సమర్పించాలన్నారు. పాఠశాలలకు సరఫరా చేసే సరుకులు తాజాగా ఉండాలన్నారు. ఈ ఫుడ్‌ కమిషన్‌ ద్వారా అవినీతి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రం, వివిధ రకాలైన వసతి గృహాలకు సరఫరా చేసే గుడ్లు 45 నుండి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించారు. వసతి గృహ విద్యార్థులకు వారానికి రెండు రోజులు 80 గ్రాముల తాజా కోడి మాంసం పెట్టాలన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎక్కడైనా మరుగుదొడ్లకు సంబంధించిన డోర్లు రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలన్నారు. ఈ సమావేశంలో సివిల్‌ సప్లై డిప్యూటీ డైరెక్టర్‌ పి సురేష్‌, జిల్లా అధికారి ఆర్‌.శివ ప్రసాద్‌, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌ రాజ్‌, డిఎంఓ గణేష్‌ కుమార్‌, ఎడిఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనూష, ఎఎంఓ సి.శ్రీహరి, జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ జి పార్వతీశ్వరరావు, సిడిపివోలు సంధ్యారాణి. ప్రసన్నకుమారి, ఎంఇఒలు ఎం.సత్యనారాయణ దొర, మల్లేశ్వరరావు, ఏటిడబ్ల్యూఓ రామ తులసి, జిసిసి మేనేజర్లు ముర్ల నాగరాజు రెడ్డి, విజయలక్ష్మి, పాల్గొన్నారు.