
కొండపల్లి దుర్గాదేవి శ్రామిక జనాభ్యుదయం కోసం ఉద్యమించి, ఆఖరికి ఆరోగ్యం క్షీణించి కన్నబిడ్డల సేవలో సేదదీరుతూ అస్తమించారు. దూరంగా ఉన్నా నాతో ఎప్పుడూ ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడుతుండేవారు. మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలకు విజయవాడ వచ్చినప్పుడు, సమావేశంలో మాకు తన అనుభవాలెన్నో చెప్పేవారు. కోడలు వినత (పవన్ భార్య) దుర్గాదేవి గారికి నిరంతరం సేవలందించి, తన తల్లిదండ్రుల వారసత్వానికి ప్రతినిధిగా నిలిచింది (పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఆరోగ్యం పాడై, రెండు సార్లు పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు ఆయనకు ప్రత్యేక ఆహారం తయారు చేయటంలో ఎంతో మంచి ప్రావీణ్యంగల విజయ, జోగారావుగార్ల ఏకైక కుమారై వినత).
ముఖ్యంగా దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జన్సీ (1975-76) విధించిన చీకటి రోజులు. దేశవ్యాపితంగా ఎక్కడి వారినక్కడ ఆరెస్టులు చేసి జైళ్ల పాలు చేసింది. కమ్యూనిష్టు పార్టీ నాయకులంతా, అజ్ఞాతవాసం లోకి వెళ్ళిపోయారు. దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ప్రతిపక్షమనేది లేకుండా పోయింది. అంతటి భయంకర పరీక్షా సమయంలో సిపిఎం రాష్ట్ర కమిటీకి ఇన్‌ఛార్జిగా ఖమ్మంలో ఉన్న కా|| కె.ఎల్. నర్సింహం గారు రహస్యంగా విజయవాడ వచ్చి...ప్రజా సంఘాలకు రాష్ట్ర పార్టీ ఆదేశాలను రహస్యంగా అందిస్తూ ఎంతో నేర్పు, ఓర్పుతో, అద్భుతమైన సేవలు అందించారు.
ప్రజాతంత్ర ఉద్యమాలలో దుర్గాదేవి, కె.ఎల్ దంపతుల జీవనయానాన్ని విడదీసి వేరువేరుగా రాయటం కష్టం. ఆ అపురూప దంపతుల ప్రజా సేవ అటువంటిది. అది విజయవాడ లోని ప్రజా వైద్యశాలలో హాస్పటల్ డా.భాస్కరరావు, డా. రామారావు, డా. ఉష, డా. సుధాకర్ వైద్య సేవలు అందిస్తున్నారు. హాస్పటల్ పైఅంతస్థులో ఒక చిన్న గది. ఆ గదిలో చిన్న టేబుల్, ఒక కుర్చీ. ఆ కుర్చీలో బక్కగా ఉన్న కామ్రేడ్ కె.ఎల్ గార్ని నేను మొదటిసారి చూశాను. ఆయన నాతో ఏమీ మాట్లాడకుండా, నా చేతిలో చిన్న కాగితం పొట్లం ఎట్టారు. అది విప్పి చూస్తే అందులో పార్టీ ఆదేశం రాసి ఉంది. అది ఆయుర్వేదం మందు పొట్లం లాగా ఉంది. నేను వెనుదిరుగుతుంటే దుర్గాదేవి గారు వచ్చారు. నన్ను చూసి విప్పారిన ముఖంతో 'చూడు అమ్మాజీ... ఈ కె.ఎల్ కి కాఫీ కలుపుకోవటం కూడా రాదు. ఇక్కడ ఏం వండుకుని తింటున్నాడో?' అని బాధగా అన్నారు. ఆయన టేబుల్ దగ్గరలోనే ఒక కిరోసిన్ స్టవ్, రెండో మూడో గిన్నెలు, అత్యవసరమైన సామాను ఉన్నాయి. ఆయనే గదిని శుభ్రం చేసుకుంటూ గిన్నెలు తోముకుని, బట్టలు ఉతుక్కుని, నిశ్శబ్దంగా పార్టీకి అత్యంత మెలకువతో అద్భుతమైన సేవ చేశారు. వేయి కళ్లతో ప్రతి నిమిషం పరిసరాలను గమనిస్తూ యుద్ధంలో సైనికుడుగా పని చేశారు. కె.ఎల్ గారు అమోఘమైన నిశ్శబ్ద సేవకులు. దుర్గాదేవి గారు అందుకు భిన్నంగా మంచి వాగ్దాటితో, అందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పేవారు. 1986లో కేరళ లోని తిరువనంతపురంలో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) రెండవ మహాసభలో ఆమె ఉత్సాహం, చొరవ మరువలేం. భాష రాకపోయినా, అక్కడి వలంటీర్లని అభినందిస్తూ, ఆప్యాయంగా పలకరించేవారు. మోటూరు ఉదయంగారు ఆ మహాసభకు మన ప్రతినిధులందరినీ విజయవాడ నుండి ప్రత్యేకంగా బస్సు మాట్లాడి తీసుకెళ్లారు. ఆ తరం నాయకత్వం, వారు చేసిన ఏర్పాట్లు మర్చిపోలేం.
నేను ఒకసారి మహిళాసంఘం కార్యక్రమానికి ఖమ్మం వెళ్లాను. ఆ ప్రోగ్రాం అయిపోయాక దుర్గమ్మ గారు నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడామె అనేక విషయాలు పంచుకున్నారు. ఆమె రోజూ కె.యల్ గారితో కలసి ఆఫీసుకు వెళ్ళేవారట. నువ్వు ఇంటి పనులు పూర్తికాగానే పరిగెత్తుకుంటూ అంత హడావిడిగా రావటమెందుకు? కాసేపు ఉన్నాక రావచ్చు కదా? అనేవారట. 'యువకులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఆఫీసుకి ఉదయమే వస్తారు. వారి కుటుంబాల లోని మహిళలను కార్యక్రమాలకు ప్రోత్సహించేలా నాలుగు విషయాలు మాట్లాడితే, ఎక్కువమంది మహిళా కార్యకర్తలు తయారవుతారనేది నా ఉద్దేశ్యం. అందుకనే ఉదయమే కె.యల్ తో కలిసి వెళ్ళిపోతాను. ఉదయం వెళ్ళకపోతే వాళ్లెవరూ దొరకరు. ఎందుకంటే మహిళా ఉద్యమంలోకి ఎక్కువ మంది మహిళలు రావాలనేది నా ఆశ' అని చెప్పారు.
దుర్గాదేవి గారి కుమార్తె సుధ క్యాన్సరు వల్ల చనిపోయింది. ఆమె భర్త కూడా చనిపోయారు. మనవడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని ఎక్కువకాలం ఆ కూతురు ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడోసారి నేనూ, మల్లు స్వరాజ్యం గారు, పుతుంబాక భారతి కలిసి దుర్గమ్మగారి దగ్గరకు వెళ్లాం. కుర్చీకే పరిమితమై, అనారోగ్యంతో, మందులతో రోజులు గడుపుతున్న ఆమెను చూస్తే చాలా బాధ కల్గింది. అప్పుడు కూడా మహిళా ఉద్యమం గురించి ఎన్నో సంగతులు మాట్లాడారు. ఇటీవల మంచం పట్టి పవన్ దగ్గర ఉండగా దుర్గాదేవిని చూడలేకపోయాననే బాధ మాత్రం నన్ను విడవడంలేదు. దుర్గాదేవి, స్వరాజ్యం, సూర్యావతి, ఉదయం, బిక్షావతి, పర్సా భారతిల త్యాగాల చరితం నేటి యువ కార్యకర్తలకు మార్గదర్శకం.
దుర్గాదేవికి తన తండ్రిగారి ఇల్లే గురుకుల పాఠశాల. మహా నాయకులు రాజకీయ పాఠాలు చెప్పిన పాఠశాలలో వారు బోధించిన సామాజిక చైతన్యం ఆమెలో బలమైన శక్తిగా నిలిచింది. ఆ చైతన్యంతోనే అలసట తెలియని, శక్తివంతమైన సామాజిక సేవలో దుర్గాదేవి గారి జీవితం చరితార్థమైంది. ఆకలి, అజీర్తి లేని సమ సమాజ నిర్మాణం కోసం... తల్లి ఒడి లాంటి సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం దుర్గాదేవి దంపతులు అహర్నిశలు శ్రమిస్తూ, తపిస్తూ అస్తమించారు. వారి ఆశయ సాధనే జీవిత పరమార్ధంగా ఈ తరం ఉద్యమించాలి. దుర్గాదేవి, కె.ఎల్. అందించిన శ్రమజీవుల పతాకం నలుదిశలా తన ప్రభావాన్ని చూపుతుంది. సోషలిజం సాధిస్తుంది. అది అనివార్యం అజేయం.
మా ప్రియ సహచరి దుర్గాదేవి ఆశయ ప్రతిభకు జేజేలు.
- అమ్మాజీ