దే శ ప్రజల ఆదాయాలు పడిపోయాయని, ఆహార అభద్రత పెరిగిందన్న హంగర్ వాచ్-2 నివేదికలోని అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ రెండవ దశ అనంతరం ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేయడం కోసం రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ సంస్థలు 2021 డిసెంబర్ నుండి 2022 జనవరి వరకు 14 రాష్ట్రాల్లో సర్వే చేపట్టాయి. తమ ఆదాయాలు కోవిడ్ రాక ముందునాటి కంటె తగ్గిపోయాయని సర్వేలో సమాధానాలిచ్చిన వారిలో 66 శాతం అంటే మూడింట రెండువంతుల మంది చెప్పారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో విదితమవుతోంది. పట్టణాల్లో నెలకు రూ.3,000, అంతకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. అలాగే సర్వే కంటె ముందు నెలతో పోల్చితే తమ ఆహారంలో అదే మోతాదులో వరి, గోధుమ తదితర తృణ ధాన్యాలను భుజించినట్టు కేవలం 34 శాతం మంది కుటుంబాలు మాత్రమే చెప్పాయి. దాదాపు 79 శాతం మంది తాము ఏదో ఒక రూపంలో ఆహార అభద్రతను ఎదుర్కుంటున్నట్టు వెల్లడించారు.
ఆహార లేమి, అభద్రత వంటి అంశాల్లో భారత్ దిగజారడం హఠాత్పరిణామం కాదు. 2021 ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 116 దేశాల్లో భారత్ 101వ స్థానంలో ఉంది. అంతకు ముందరి ఏడాది 94వ స్థానంలో ఉన్నది. ఇలా దిగజారి 'తీవ్ర స్థాయిలో ఆకలి కలిగిన' దేశాల జాబితాలో చేరింది. ఎత్తుకు తగిన బరువుకన్నా చాలా తక్కువ గల పిల్లలున్న దేశాల్లో భారత్ ఒకటయింది. మన దేశ బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, శిశు మరణాల రేటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తేల్చింది. ఇలా ఏ జాతీయ, అంతర్జాతీయ సర్వే లేదా అధ్యయన నివేదికలన్నీ మన దేశ పరిస్థితి అంతకంతకూ కుంగిపోతున్నదని స్పష్టం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ చెప్పిన అచ్ఛే దిన్, సబ్ కా వికాస్ వంటి మాటలు నీటి మూటలై ఆకలి భారతం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ముఖ్యంగా ఎదిగే పిల్లలకు పౌష్టికాహార కల్పనకు ప్రభుత్వాలు కృషి చెయ్యాలి. కాని, మోడీ సర్కారు తీరు అందుకు విరుద్ధంగా వుండడం శోచనీయం. మధ్యాహ్న భోజనానికి కేటాయించే నామమాత్రపు మొత్తాలను సైతం కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2021 నాటికి 32.3 శాతం తగ్గించింది. బాలింతలకు, చిన్న పిల్లలకు ఆహారాన్ని అందించే ఐసిడిఎస్ పథకానికి కేటాయింపులు చూపిస్తూనే ఏడాది చివరికి ఖర్చులో భారీ కోతలు విధిస్తోంది. తాజా బడ్జెట్‌లోనూ అదే తీరు కొనసాగింది.
రేషన్ కార్డులున్నవారిలో 90 శాతం మంది ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పొందగలిగామని సర్వేలో చెప్పారు. కనుక ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృతం చెయ్యడానికి సర్కారు కృషి చేయాలి. కాని, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రేషన్ కార్డులన్నిటికీ సబ్సిడీపై ఆహార ధాన్యాలను కేంద్రం సమకూర్చడం లేదు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కార్డులకు మాత్రమే ఇస్తామంటోంది. మిగతా కార్డులన్నిటి సబ్సిడీ మొత్తాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే సుమారు 40 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు వెలుపలనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడం మానేసి 'ఒక దేశం ఒకే రేషన్ కార్డు' వంటి మాటల మాటున ఉన్నదానికి మరిన్ని చిల్లులు పెట్టడం అమానుషం. తిండికే అష్టకష్టాలు పడుతున్న దుస్థితిలో చిన్నారుల చదువులకూ తిప్పలు తప్పడంలేదు. తమ కుటుంబాల్లో కనీసం ఒకరు ఈ కాలంలో పాఠశాల డ్రాపౌట్ అయ్యారని 18 శాతం మంది గృహస్తులు పేర్కొన్నారంటే భవిష్యత్ భారతం ఎంత అంధకార మయమవుతుందో ఊహకే అందడం లేదు. ఇప్పటికైనా ప్రజల ఆదాయాల పెంపుదలకు, తద్వారా ఆహార భద్రత కల్పనకు అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. అయితే, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను నెత్తికెత్తుకున్న సర్కారుకు సామాన్య ప్రజల సంక్షేమం పట్టదు. కనుక బలమైన ఐక్య ప్రజా ఉద్యమాలనే అంకుశంతో దాన్ని పొడవాలి. అప్పుడే కొంతయినా కదలిక వస్తుంది. దేశ ప్రజల పరిస్థితి మరింతగా దిగజారకుండా ఇక్కడితోనైనా ఆగుతుంది.










