గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ ఏడాదికి ఆకలిపై ర్యాంకులివ్వగా ప్రపంచంలోనే భారతదేశం 94వ స్థానంలో అట్టడుగున కునారిల్లడం దేశంలోని వాస్తవ పరిస్థితులకు దర్పణం వంటిది. నిరుడు కూడా ఆకలి సూచీలో మన దేశానికి 102వ స్థానం వచ్చింది. అలాగని మెరుగు పడిందనుకుంటే పొరపాటు. గతేడాది 117 దేశాలను పరిగణనలోకి తీసుకోగా ఇప్పుడు 107 దేశాలను పరిశీలించడం వలన వచ్చిన తేడా తప్ప ఆకలి సమస్య కొంత తీరిందని కాదు. ఆకలి కేకల్లో మన దేశం మరింత అథమ స్థాయికి దిగజారిన తాజా ఆకలి సూచి లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిక్స్ దేశాల్లో మన దేశం 27.2 పాయింట్ల స్కోర్‌తో అత్యల్ప స్థాయిలో ఉంది. అంతేకాదు, పొరుగునున్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ సైతం ఆకలి సూచీలో మన కంటే మెరుగ్గా పై స్థానాల్లో ఉన్నాయి. ఎక్కడో మారుమూలన దక్షిణాఫ్రికా లోని చిన్న దేశాలు మాత్రమే మన కంటే దిగువనున్నాయి. ఇంకా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పలు విషాదకర అంశాలను వెల్లడించింది. మన దేశ జనాభాలో 14 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేళ్ల లోపు బాలల్లో ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 38 శాతం మంది అని, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 21 శాతం మంది అని కఠోర సత్యాలను బట్టబయలు చేసింది. ఇప్పటికీ పౌష్టికాహార లోపం వలన 3.7 శాతం మంది పిల్లలు మరణించడం అత్యంత ఆవేదన కలిగించే ఘోరం.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన ఆరున్నరేళ్లలో ఆకలి సమస్య తీవ్రమవుతోందనడానికి హంగర్ ఇండెక్స్ గణాంకాలే సాక్ష్యం. 2016లో 76 దేశాలకు ర్యాంకులివ్వగా 55వ స్థానంలో మన దేశం ఉంది. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికొచ్చేసరికి బంగ్లాదేశ్ 75, పాకిస్థాన్ 88వ స్థానంలో మన కంటే పైనున్నాయి. దేశంలో ఆకలి సమస్య తీవ్రం కావడానికి ఆహార ధాన్యాల కొరత కారణం కాదు. ఆహార ధాన్యాల దిగుబడులు కొంచెం అటూ ఇటూగా 250-270 మిలియన్ టన్నులు లభిస్తూనే ఉన్నాయి. భారత ఆహార సంస్థ గోదాముల్లో 7 కోట్ల టన్నులకు పైగా నిల్వలు మూలుగుతున్నాయి. ప్రజలేమో ఆకలి, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. యుపిఎ హయాంలో ఆహార భద్రతా చట్టం వచ్చింది. ప్రజల కనీస ఆహారానికి ఆ చట్టం కొంత వరకైనా పూచీ పడుతోంది. చట్టాన్ని అమలు పర్చడంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆకలి సూచి ర్యాంకులే సూచిస్తున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వం ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసింది. నగదు బదిలీ, ఒక దేశం-ఒక రేషన్ కార్డు వంటి వాటితో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను నీరుగార్చేందుకు ఉపక్రమించింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని, గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ఐసిడిఎస్ పథకాన్ని ప్రైవేటీకరిస్తోంది. నూతన విద్యా విధానంలో ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రతిపాదించి అంగన్‌వాడీ కేంద్రాలకు ఎసరు పెడుతోంది. ఈ చర్యలన్నీ ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచేవే. కొన్ని వర్గాల ప్రజలను ఇప్పుడందుతున్న ఆహారానికి సైతం దూరం చేస్తాయి.
మామూలు రోజుల్లోనే ఆహార సమస్య దేశంలో తీవ్రంగా ఉంది. కరోనా మహమ్మారి వలన సమస్య మరింత ముదిరింది. ఉపాధి కోల్పోయి కోట్లాది మంది పొట్ట చేత పట్టుకొని రోడ్డున పడ్డారు. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాని ప్రభావంతో ఆహార పదార్ధాల ధరలు పెరిగి ప్రజలకు ఆహారం దూరమవుతోంది. కరోనా లాక్‌డౌన్ లోనూ ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలను విడుదల చేసేది లేదని కేంద్రం భీష్మించింది. పనుల్లేక ఆకలితో ప్రజలు, వలస కూలీలు అలమటిస్తున్నా దుర్మార్గంగా వ్యవహరించింది. సరిగ్గా ఇప్పుడే రైతులకు, ప్రజల ఆహార భద్రతకు ముప్పుగా పరిణమించే వినాశకర వ్యవసాయ చట్టాలను బలవంతంగా రుద్దింది. ఎఫ్‌సిఐ పని చేసినప్పుడు, కనీస మద్దతు ధర, ఆహార పదార్ధాల నిల్వలపై పరిమితులు ఉన్నప్పుడే ప్రజల ఆకలి కేకలు పిక్కటిల్లుతున్నాయి. అలాంటిది వ్యవసాయ సంస్కరణలు అమల్లోకొస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయి. నయా-ఉదారవాద విధానాలు రెండు భారతాలను సృష్టిస్తున్నాయి. ఒకటి పేదలు మరింత పేదలుగా మారుతుండగా రెండవ వైపు అంబానీ, అదానీల సంపద ఇంకా ఇంకా పెరుగుతోంది. మోడీ ప్రభుత్వం రెండవ వైపు పని చేస్తోంది. ప్రభుత్వ విధానాలు మారితేనే ఆకలి సమస్య తీరుతుంది.










