Jul 10,2023 00:04

ప్రజాశక్తి-తాడేపల్లి : 40 ఏళ్ల నుంచి ఇళ్లు వేసుకుని నివాసముంటున్న ఈ స్థలాలకు రైల్వేకు పనికిరావు. గత పంచాయతీ నుంచి మున్సిపల్‌, కార్పొరేషన్‌ అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పించాయి. రాజధానిలో ఇచ్చిన సెంటు ఇంటి స్థలం దగ్గరకు మేము వెళ్లడానికి సిద్ధంగా లేము. మేము ఇప్పుడు ఉంటున్న స్థలాలకు పట్టాలిచ్చే విధంగా చూడండి... అని ప్రజలు ఘంఠాపథగా చెబుతున్నారు. పట్టణంలోని వెంకయ్యకొట్టు సెంటర్‌, రన్నింగ్‌రూమ్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో రైల్వేకు పనికిరాని స్థలాల్లో ఉంటున్న బాధితుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సిపిఎం బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరానికి దగ్గరలో అభివృద్ధి చెందుతున్న తాడేపల్లిలో ఏదో ఒక పని చేసుకుని ఇక్కడ బతుకుతున్నాం. అక్కడకు వెళ్తే మాకున్న జీవనం పోతుంది... అని చెప్పారు. వర్షాకాలం వస్తే అక్కడ మోకాళ్లలోతు నీళ్లలో ఉండే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మా బాగోగుల గమనించి ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.. అని కోరారు. రాజధాని అమరావతిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమి పట్టాలు ఇచ్చినా తాము ఎక్కడికీ వెళ్లబోమని, ఇక్కడే ఉంటామని ఖరాఖండిగా చెబుతున్నారు.
ఎక్కడున్న వారికి అక్కడే పట్టాలివ్వాలి : సిపిఎం
వెంకయ్యకొట్టు సెంటర్‌, రన్నింగ్‌ రూమ్‌ సెంటర్‌, కొత్త వడ్డెర కాలనీ, ముగ్గురోడ్డు, పోతురాజుస్వామి గుడి, లంబాడీపేట, సీతానగరం తదితర ప్రాంతాల్లో సుమారు 900 మంది రైల్వే స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. వీరు నివాసముంటున్న ప్రాంతాల్లో విద్యుత్‌, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో తాడేపల్లి బాధితులదంరికీ సెంటు స్థలం చొప్పున ఇచ్చిందని, ఈ సంతోషం పేదల్లో లేదని తమ పర్యటనలో తేలిందని చెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలు తమకు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారన్నారు. సెంటు భూమిలో ఎలా బతుకుతామని అడుగుతున్నారని అన్నారు. కోళ్లు, గేదెలు మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉన్నాయని, వారి జీవనోపాధికి ఇబ్బంది కలిగేలా ఉందని తెలిపారు. కృష్ణుని గుడి వద్ద గల సచివాలయానికి రాయభార కార్యక్రమంతో పాటు ప్రజలందరితో అర్జీలు ఇచ్చే కార్యక్రమం బుధవారం నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు జి.సుబ్బారెడ్డి, కె.కరుణాకరరావు, ఎస్‌.ము త్యాలరావు, డి.విజరుబాబు, బాబురావు పాల్గొన్నారు.
బేతపూడి జయలక్ష్మి
ప్రస్తుతం మేము ఉంటున్న స్థలంలోనే ఉంటాం. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఇప్పుడు సెంటు స్థలం ఇచ్చి వెళ్లమంటే వెళ్లలేం. మేము ఇప్పుడు ఉంటున్న స్థలాలకే పట్టాలివ్వాలి.
దోమతోటి జయమ్మ
అసలైన పేదలకు కూడా ఇంజినీర్లకు కూడా రాజధానిలో స్థలం ఇచ్చారు. ఉన్నోడికి ఇచ్చి లేనోడికి ఎగొట్టారు. సెంటు భూమి కాకుండా రెండు సెంట్లు ఇవ్వాలి.
నన్నం వెంకటమ్మ
పేదలకు ఇచ్చిన స్థలం సిఎం బాత్రూమ్‌ అంత ఉండదు. మాకు అసలు స్థలం ఇవ్వలేదు. బిడ్డ చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ రాలేదు. 45 సంవత్సరాలు దాటిన మహిళకు పింఛను అన్నారు అదీ రాలేదు.
ఓర్సు వెంకటేశ్వరరావు
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలు బాగా లోతులో ఉన్నాయి. వర్షం వస్తే మోకాళ్లలోతు నీరు నిలబడుతుంది. అక్కడకు వెళ్తే పిల్లలు చదువుకో వడానికి వసతులు లేవు.