ప్రజాశక్తి - చిప్పగిరి
మండల అధికారులతో పరిష్కారమయ్యే దరఖాస్తులను కూడా కలెక్టరేట్ స్పందనకు పంపిస్తున్నారని, అలా జరగకుండా చూసుకునే బాధ్యత మండల అధికారులపై ఉందని ప్రత్యేకాధికారి, సమగ్ర శిక్ష పిఒ డాక్టర్ కె.వేణుగోపాల్ సూచించారు. గురువారం మండలంలోని బెల్డోన గ్రామంలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సుధాకర్ రాజు ఆధ్వర్యంలో పర్యటించారు. సచివాలయ కార్యాలయంలో అధికారుల పనితీరును, స్పందనను నిర్వహిస్తున్నారా, లేదా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నాడు-నేడు ద్వారా జరిగే పనులను, అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీలో పర్యటించి ఇల్లు కట్టుకోలేని లబ్ధిదారులకు తహశీల్దార్ ద్వారా నోటీస్ అందించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు పొందినవారు తప్పనిసరిగా ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రతి అధికారీ అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం మండల కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్పంచులు సావిత్రి, పురుషోత్తం, ఇఒఆర్‌డి సంజన్న, ఎంఇఒ మస్తాన్ రావు, పిఆర్ ఎఇ చోళ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ రామనీలా, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రసూన, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, హౌసింగ్ అధికారి భవ్య, పంచాయతీ కార్యదర్శులు నరేంద్ర, రామాంజిని పాల్గొన్నారు.
కుందనగుర్తిలోని జగనన్న కాలనీలో పర్యటిస్తున్న అధికారులు










