
ప్రజాశక్తి - ఆకివీడు
పట్టణంలో పెరుగుతున్న అరాచకాలను, ఆగడాలను అధికారులు వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూటమిగా ఏర్పడి ఉద్యమించాల్సి వస్తుందని అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరించింది. ఇటీవల ముఠాకార్మికులపై జరిగిన దాడిపై శనివారం ప్రజాసంఘాల కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు సామాజిక సంస్థలతో సిఐటియు ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు మండల కార్యదర్శి కె.తవిటి నాయుడు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రౌడీ మూకల వల్ల సామాన్యులు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యాలయంలో కూర్చున్న ముఠాకార్మికులపై అన్యాయంగా దాడి చేసిన తెలగపాముల యువకులపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రకమైన విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. వైసిపి పట్టణ అధ్యక్షులు గుండా సుందరరామనాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జగ్గురోతి విజరు, నగర పంచాయతీ కౌన్సిలర్ కట్ట రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. టిడిపి నాయకులు బొల్లా వెంకట్రావు, గంధం ఉమా సత్యనారాయణ మాట్లాడుతూ నాటుసారా, విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్లే యువకులు పెడదోవ పట్టి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. అనంతరం సామాజిక న్యాయ సేవా సంఘం నిర్వాకులు డివి.రమణమూర్తి, జనసేన నాయకులు గవర అనిల్, తోట వాసు, ఐద్వా మండల అధ్యక్షురాలు డోకల లక్షీ మాట్లాడారు. అనంతరం దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు లంక సూర్యారావు, న్యాయవాది సూరంపూడి ఆంజనేయులు, మన్నే సుబ్రహ్మణ్యం కుంకట్ల దానయ్య, ఎమ్‌డి అజ్మల్, జక్కీ అహ్మద్, ప్రజాసంఘాల నాయకులు డోకల రవి, బివి.వర్మ, బి.రాంబాబు, ఎస్.సూరిబాబు, డి.సత్యనారాయణ, పెంకి అప్పారావు, ముఠా కార్మికులు సత్యం, మణిపురి, జి.రాంబాబు, అప్పలనాయుడు, రమణ పాల్గొన్నారు.