
అవును.. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఓ అద్భుతం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాదు, మానవ అభివృద్ధిలోనూ ఇది కొత్త చరిత్రను సృష్టించింది. పొరుగువాడి శ్రమను దోచుకోవడమే సహజ న్యాయంగా చలామణి అవుతున్న ప్రస్తుత సమాజంలో.. సమిష్టి శ్రమతో సాధించే వికాసాన్ని తెరమీదకు తెచ్చింది. అంతేకాదు.. ఈ టెలిస్కోప్ నిర్మాణంలో వేలాదిమంది శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. వీరంతా ఒక్క కంపెనీకో, ఒక్క దేశానికో చెందినవారు కారు. నాసాతో పాటు 14 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు ఇంకా వివిధ స్థాయిల సిబ్బంది ఈ కృషిలో పాలుపంచుకున్నారు. ప్రణాళికను రూపొందించడం నుండీ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేంత వరకూ వివిధ స్థాయిల్లో జరిగిన విజ్ఞాన సాగర మథనంలో వీరందరిదీ కీలకపాత్రే! మానవ సంక్షేమమే ధ్యేయంగా 20 ఏళ్ల పాటు సాగిన ఈ మహాయజ్ఞంలో ఒకటే కొరత. వేదాలలోనే అన్నీ ఉన్నాయంటూ జబ్బలు చరుచుకునే మన పాత్ర ఈ మహత్తర కృషిలో నామమాత్రంగా కూడా లేదు. ఈ కృషి మహా ఉధృతంగా సాగుతున్న రోజుల్లో మనం గత కాలపు ఘనతల ప్రశంసలతో మునిగిపోయాం. ఒక దేశంగా ఇది మనకు ఎప్పటికీ పూడ్చలేని ఆలస్యం. ఈ టెలిస్కోప్ అందించే పరిశోధనలను వినియోగించుకునే సమయంలో భావితరాలు మన భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తే.. ఒక జాతిగా జవాబు చెప్పలేని స్థితి మనది. గోవు మలమూత్రాల కాల్పానిక విశిష్టతల చుట్టూ ఒక తరాన్ని తిప్పిన కార్పొరేట్, మతోన్మాద పాలకులదే ఈ వైఫల్యానికి బాధ్యత.
- అంతరిక్షంలో అద్భుతం..
'చందమామ రావే.. జాబిల్లి రావే..!' అంటూ చిన్నప్పుడు అమ్మ పాడే పాటతోటే అంతరిక్షంపై మన ఆసక్తి ప్రారంభమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మబ్బులు, మేఘాలు.. ఇలా ఒకటేంటి ఆకాశంలోని ప్రతిదీ మనకు అద్భుతమే! భూగోళంపై మానవుడి ఉనికి ప్రారంభమైనప్పటి నుండి ఆ అద్భుతం మనల్ని ఊరిస్తూనే ఉంది. అలా చూస్తూనే ఉంటే మనం మనుషులం ఎందుకవుతాం? ఊరించే ఆ అద్భుతాన్ని అందుకోవడానికి, అందులోని రహస్యాలను వెలికి తీయడానికి ప్రయత్నించాం. ఈ క్రమంలో ఎన్నో వైఫల్యాలు. అయినా కుంగిపోలేదు. ఒకదాని తరువాత ఒకటి పేర్చుకుంటూ అంతరిక్షాన్ని శోధిస్తూనే ఉన్నాం. ఈ ప్రయోగాల పరంపరలోనే హబుల్ టెలిస్కోప్ ఉనికిలోకి వచ్చింది. అంతరిక్షంలోనే ఒకచోట చేరి, ఎప్పటి ఫోటోలు అప్పుడు భూమి మీదకు పంపేది. అంతరిక్ష పరిణామాలపై మనిషి ఉంచిన నిఘా నేత్రం ఇది! దశాబ్దాలుగా నిర్విరామంగా పనిచేయాల్సి రావడంతో ఇది అలసిపోయింది. అవశాన దశకు చేరుకుంది.
- అలా మొదలైంది...!
హబుల్ టెలిస్కోప్‌ను 1990 ఏప్రిల్ 24న అంతరిక్షంలోకి పంపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1.50 మిలియన్ దృశ్యాలను ఫోటోలుగా హబుల్ భూమి మీదకు పంపింది. దీని పనితీరు 2009 నాటికే మందగించింది. వ్యోమగాములు బృందం ఐదుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి, మరమ్మతులు చేసినప్పటికీ హబుల్ పనితీరు ఆశించినంతగా మెరుగుపడలేదు. హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపడం అనివార్యంగా మారింది. అయితే, ఈ కాలంలో శాస్త్ర, సాంకేతికత అనూహ్యంగా పెరిగింది. కొత్త కొత్త అవిష్కరణలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ వృద్ధి, శాస్త్ర నైపుణ్యాలు భూగోళమంతా సమానంగా లేవు. ఒక్కో దేశం ఒక్కో రంగంలో అభివృద్ధి సాధించింది. ఈ నైపుణ్యాలను, పరిశోధనలను ఒకచోట చేరిస్తే హబుల్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైన టెలిస్కోప్ రూపొందే అవకాశం ఉంది. అయితే, ఇదంత సులభమేమీ కాదు. అమెరికాతో పాటు ఏ ఒక్క దేశానికి కానీ, నాసాతో పాటు ఏ ఒక్క సంస్థకు కానీ ఇది సాధ్యమయ్యే పనికాదు. భారీ ఖర్చుతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఒకచోట చేర్చాల్సి రావడమే దీనికి కారణం. అప్పుడు పెట్టుబడిదారీ సమాజం మరచిపోయిన ఆలోచనను నాసా చేసింది. మానవాళి మనుగడ కోసం చేస్తున్న ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలంటూ శాస్త్ర సాంకేతిక ప్రపంచానికి విజ్ఞప్తి చేసింది. పరస్పర సహకారం, ప్రయోజనాల ప్రాతిపదికగా ఈ కృషి సాగుతుందని తెలిపింది. నాసాతో కలిసి పనిచేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనెడియన్ స్పేస్ ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 25 రాష్ట్రాలతో పాటు.. 14 దేశాలు ఆ కృషిలో భాగస్వామ్యమయ్యాయి. ఆ దేశాల్లోని ఆరు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాలు, 308 పరిశోధక సంస్థలు పాలుపంచుకున్నాయి. అలా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పురుడు పోసుకుంది. సాధారణ కంటికి కనిపించని దృశ్యాలను సైతం చూడటానికి వీలుగా ఇన్‌ఫ్రా రెడ్ కిరణాల సాంకేతికతను దీనిలో వినియోగించారు.
- అద్భుతం ఎందుకు....?
ఇది 9.7 బిలియన్ డాలర్లతో చేపట్టిన ప్రాజెక్టు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 74,352 కోట్ల రూపాయలు. 2020వ సంవత్సరంలో వేసిన అంచనాల మేరకు అప్పటి ద్రవ్యోల్బణాన్నీ పరిగణనలోకి తీసుకుంటే 10.8 బిలియన్ డాలర్లకు ప్రాజెక్టు ఖర్చు చేరింది. దీనిలో అత్యధిక భాగం అంటే 8.8 బిలియన్ డాలర్లను స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధికోసం 2003-2021 సంవత్సరాల మధ్య ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది భారీ మొత్తంలో అయ్యే ఖర్చు ఒక్కటే కాదు.. నిజానికి అంతకుమించి.. ప్రాజెక్టు ప్రతిపాదన 1996లో ముందుకు వచ్చినప్పటి నుండి 2021 డిసెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేంత వరకూ.. 14 దేశాలకు చెందిన 1,682 మంది కీలక శాస్త్రవేత్తలు దీనికోసం పనిచేశారు. వీరితో పాటు అంతకు రెట్టింపు సంఖ్యలో ఇంజినీర్లు, టెక్నికల్ సిబ్బంది, ఇతరులు 24 ఏళ్ల పాటు నిర్విరామ యజ్ఞాన్ని చేశారు. మరో మాటలో చెప్పాలంటే ఇన్ని దేశాలకు చెందిన వేలాది మంది, ఇంతకాలం పాటు మరో ధ్యాస లేకుండా నిమగం కావడం పరిశోధనా రంగంలోనే ఒక కొత్త అధ్యాయం! ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత విస్తృతంగా సహకార ప్రాజెక్టులు రూపొందే అవకాశం ఉందన్న ఆశాభావం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది.
- అమెరికాలో వానపడితే..
అది 2017వ సంవత్సరం.. ఆగస్టు నెల! అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారీవర్షం. హార్వే హరికేన్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. జేమ్స్ వెబ్‌స్పేస్ టెలిస్కోప్ రూపొందుతున్న టెక్సాస్ నగరం ఈ వర్షపు ధాటికి దాదాపుగా నీటమునిగింది. ప్రాజెక్టు కేంద్రం చుట్టూ కూడా పెద్దమొత్తంలో వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టుకు వెళ్లే రోడ్లన్నీ కొన్ని అడుగుల నీటితో నిండిపోయాయి. సిబ్బంది ఎవ్వరూ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అమెరికాలోని ప్రజలకే కాదు.. వివిధ దేశాల్లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాజెక్టులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలందరికీ కంటిమీద నిద్రలేని స్థితిని సృష్టించింది. అప్పటికే టెలిస్కోప్ పనులు అనుకున్న దానికన్నా చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. మరో వంద రోజుల్లో స్పేస్ సిమ్యులేటింగ్ పరీక్ష చేయాల్సి ఉండగా, టెలిస్కోప్ సిస్టమ్‌లను చల్లగా ఉంచే లిక్విడ్ నైట్రోజన్ నిల్వ తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణం. లిక్విడ్ నైట్రోజన్ పూర్తిగా అయిపోతే ప్రాజెక్టు పని మళ్లీ మొదటికొచ్చి ఉండేది. దీంతో వివిధ దేశాల్లోని సిబ్బందిలో ఒకరకమైన ఉత్కంఠ. ఏం జరుగుతుందోనన్న అందోళన. చివరకు రాండే కింబ్లే అనే సైంటిస్ట్ ప్రాణాలకు తెగించాడు. అతికష్టం మీద ప్రాజెక్టులోకి చేరుకుని, వట్టిపోతున్న లిక్విడ్ నైట్రోజన్ ఛాంబర్లను నింపాడు. అప్పటిదాకా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతో ఉన్న వివిధ దేశాల్లోని సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అభినందనలతో కింబ్లేను ముంచెత్తారు. నాసా ప్రత్యేకంగా ప్రశంసించింది. సమిష్టితత్వంలో ఉన్న గొప్పతనమే ఇది కదా.. అదే కష్టాలను పంచుకోవడం..
- మనదేశ పాత్ర..
ఇన్ని దేశాలు.. అందరు శాస్త్రవేత్తలు.. సాంకేతిక నిపుణులు పాల్గొన్న ఈ మహత్తర కృషిలో 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా?! గతమెంతో ఘనమైనదంటూ మురిసిపోవడంలో మునిగితేలుతున్న తరుణంలో.. మన పాత్ర ఈ మహత్తర కృషిలో శూన్యం. ప్రాజెక్టు శాస్త్రవేత్తల్లో కానీ, ఇంజినీర్లలోగానీ, ఇతర సాంకేతిక సిబ్బందిలో గానీ మనవారు ఎవ్వరూ లేరు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన హసీమా హసన్‌ను ప్రయోగానికి ముందు జరిగిన ఫ్రీలాంచింగ్ బ్రీఫింగ్‌కు నాసా ఎంపిక చేసింది. లక్నోలో జన్మించిన హసీమా తల్లితండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. థియరాటికల్ న్యూక్లియర్ మీద అధ్యయనం చేసి, ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్న హసీమా నాసాలోనే ప్రోగ్రాం సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు కొంతకాలం ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చిలో కూడా ఆమె సేవలందించారు. హసీమా సాధించిన ఈ ఘనత తప్పిస్తే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చెప్పుకోవడానికి మనకేం లేదు.
జేమ్స్ వెబ్ ప్రత్యేకతలేంటి?
- 1961 నుండి 1968 వరకు నాసాకు నాయకత్వం వహించిన జేమ్స్ ఇ వెబ్ పేరును ఈ టెలిస్కోప్‌కు పెట్టారు.
- ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్ కన్నా అన్నివిధాల మెరుగ్గా దీనిని రూపొందించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. ఇటువంటి సమయాల్లో పాతదాని కన్నా కొత్తదాని బరువు పెరిగే అవకాశమే ఎక్కువ. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రం దీనికి భిన్నం. హబుల్ 11,100 కిలోల బరువుండగా, జేమ్స్‌వెబ్ బరువును 6,500 కిలోలకే శాస్రవేత్తలు పరిమితం చేశారు. దీనిలో ఉపయోగించిన ప్రతి పరికరం బరువు హబుల్ టెలిస్కోప్‌లోని పరికరాలతో పోలిస్తే తక్కువే.
- బరువులోనే కాదు.. దీని విస్తీర్ణం కూడా హబుల్‌తో పోలిస్తే తక్కువే. హబుల్ 2.4 మీటర్ల వ్యాసంతో 40.0 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమిస్తే, జేమ్స్‌వెబ్ 6.5 మీటర్ల వ్యాసంతో 25.37 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించేలా రూపొందించారు.
- హబుల్ టెలిస్కోప్ అతి నీలలోహిత కిరణాలు, సాధారణ కాంతి కిరణాలను ఉపయోగించి ఫోటోలు తీసేది. వాటిలో నాణ్యత తక్కువ ఉండటంతో పాటు, ఎక్కువభాగం కంటికి కనిపించే దృశ్యాల చిత్రీకరణే జరిగేది. దానికి బదులుగా జేమ్స్‌వెబ్ ఇన్‌ఫ్రారెడ్ కిరణాల సాంకేతికను వినియోగించుకుంటుంది. దీంతో సాధారణ కంటికి కనిపించని దృశ్యాలు కూడా ఫొటోల్లో కనపడతాయి.
- హుబల్‌తో పోల్చుకుంటే 150 మిలియన్ సంవత్సరాల వెనక్కి వెడుతుంది. ఇప్పటివరకు అంతరిక్షంలో అత్యంత దూరంలో నిలిచిన టెలిస్కోప్‌గా ఇది నిలుస్తుంది. దీనివల్ల గేలాక్సీలు, గ్రహాలు, డార్క్‌మేటర్ వంటి అంశాల అధ్యయనం మరింత సులభమవుతుంది.
- అంతరిక్షంలో పరిణామాలను గుర్తించేందుకు వీలుగా దీనికి 18 అద్దాలను అమర్చారు. ఏర్పాటు సమయంలో ఒక్కొక్క అద్దం బరువు సుమారు 250 కిలోలు. అయితే, ప్రయోగం చేసే సమయానికి వీటి ఒక్కొక్క దాని బరువును 21 కిలోలకు తగ్గించగలిగారు. ఈ 18 అద్దాలు విడివిడిగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు ఒకే అద్దంగా పనిచేస్తాయి.
- ఈ అద్దాలన్నీ బంగారు రంగులో కనిస్తాయి. అయితే, వీటి తయారీలో బంగారం వాడలేదు. దానిక బదులుగా బెర్రిలియం అనే లోహాన్ని వాడారు. అంతరిక్షంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులకు బంగారం త్వరగా ప్రభావితం అవుతుండటమే దీనికి కారణం. మొత్తం అద్దాలలో 48 గ్రాముల బంగారాన్ని మాత్రమే వాడారు.
- పనీ...పాట!
పని అంటేనే నలుగురు కలిసి చేసేది. నలుగురు ఒకచోట చేరితే పాట కూడా పుడుతుంది. అందుకే, పనీ-పాట జంటగానే ఉంటాయి. సమిష్టి పనిసాగే చోట ఈ సంస్కృతి మరింతగా కనిపిస్తుంది. ఆటపాటలతోటే పని కూడా ముందుకు పరుగులు తీస్తుంది. జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ నిర్మాణ సమయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. మొట్ట మొదటిసారి శాస్త్రవేత్తలు సమిష్టికృషితో ముందుకు సాగుతుంటే.. దానికి తగ్గట్టుగానే సాంస్కృతిక రంగం విరాజిల్లింది. ఒత్తిడి లేకపోవడంతో నిరంతరం మిషన్ల మధ్య నలిగిపోయే శాస్త్రవేత్తలే కళాకారులయ్యారు. ఆటవిడుపు కోసం మ్యూజిక్‌టీమ్‌నే ఏర్పాటు చేసుకున్నారు. 24 సంవత్సరాల పాటు పరిశోధనల్లో మునిగిపోతూనే సాహితీసృజన చేశారు. వారే రచయితలై, గాయకులై, సంగీత విద్వాంసులై 'అవుటా స్పేస్' పేరుతో స్పేస్ బ్యాండ్‌నే ఏర్పాటు చేశారు. ఏకంగా ఒక ఆల్బమ్‌నే రూపొందించారు. 'ఇంతకు ముందెన్నడూ ఇది కలలో కూడా ఊహించలేనిది' అంటూ ఆల్బమ్ ఆవిష్కరణ సందర్భంగా శాస్త్రవేత్తలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ శక్తి వారిలో గతంలో కూడా ఉంది. కానీ, అపుడెప్పుడూ ఉనికిలోకి రాలేదు. సంఘటితంగా చేస్తున్న ఈ సుదీర్ఘ కృషిలోనే ఇదీ వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా వెలువడ్డ ఈ సృజనకు కారణం ఏమిటో ఊహించగలరా?!
- భాగస్వామ్య దేశాలు..
అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్‌ల్యాండ్స్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్‌ల్యాండ్, బ్రిటన్
- పొగడదొరువు, 73821 68168