- 20 వేల పెట్టుబడితో 50 లక్షల టర్నోవర్
మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని అడుగడుగునా నిరూపిస్తున్నారు. సైన్యంలోనైనా, విమానాలు నడపడంలోనైనా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు చేయలేని పనంటూ లేదంటున్నారు. 2021లో ఉమెన్ పవర్ అంటే ఏమిటో చూపి ఆకాశమే మా హద్దు అంటున్న కొందరి వనితల పరిచయమే..
ఏదైనా సాధించాలన్న తపన.. స్వయం ఉపాధితో ఎదగాలనే పట్టుదల.. ఈ రెండూ ఆమెను విజయం వైపు నడిపించాయి. ఎలాంటి ప్రోత్సాహం అందకపోయినా కష్టాన్నే పెట్టుబడిగా పెట్టారామె. 20 వేల రూపాయలతో మొదలైన వ్యాపారాన్ని 50 లక్షల టర్నోవర్ సంస్థగా తీర్చిదిద్దారు. ఆమే కృష్ణాజిల్లా గన్నవరంకు చెందిన పంచుమర్తి ఉమాదేవి.
విశాఖకు చెందిన ఉమాదేవి 2016లో శిక్షణ నిమిత్తం కుటుంబసభ్యులతో వచ్చి గన్నవరంలో స్థిరపడ్డారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.20 వేల పెట్టుబడితో నార ఉత్పత్తుల తయారీని ప్రారంభించారు. ప్లాస్టిక్ సంచుల విక్రయాలపై ప్రభుత్వాలు నిషేధం విధించడంతో.. తోటి మహిళలతో కలిసి తయారీలో పాటిస్తున్న నాణ్యతను ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. బంధువులు, స్నేహితులు వినియోగదారుల ప్రచారంతో వ్యాపారంలో క్రమేణా వృద్ధి సాధించి, ఐదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. కోవిడ్ రెండు దశలతో పాటు, ముడి సరుకు రవాణా సమయంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించి, రూ.లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఆమె మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
'విద్యార్థులకు ల్యాప్‌టాప్.. ఉద్యోగులకు లంచ్‌బాక్స్, సరకు రవాణా, పాఠశాల చిన్నారులకు ఉపయోగపడే సంచులతో పాటు వివాహ, నిశ్చితార్థ, ఓణీలు- పంచలు, ఇతర శుభకార్యాల్లో బహుమతులుగా ఇచ్చేందుకు ప్రస్తుతం నార సంచులను అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్కో సంచి రూ.50 నుంచి రూ.650 వరకు అందుబాటులో ఉన్నాయి. మేమంతా ఈ వ్యాపారం ద్వారానే ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నాము' అని ఉమాదేవి బృంద సభ్యులు చెబుతున్నారు.
'శిక్షణ అనంతరం ప్లాస్టిక్ నిర్మూలనకు నార ఉత్పత్తులపై అవగాహన పెంచాలనుకున్నా. భర్త ప్రోత్సాహంతో పాటు శిక్షణ పొందిన తోటి మిత్రులు మరింత అండగా నిలుస్తున్నారు. తొలుత ఉత్పత్తులపై వచ్చిన ప్రతి రూపాయిని వ్యాపారాభివృద్ధికే పెట్టా. కరోనా ఒకింత ఆందోళనకు గురిచేసినా.. ఎదుర్కొని మందుకు సాగాం. ఏడాదికి రూ.50 లక్షల లావాదేవీలు చేస్తాం' అంటున్నారు ఉమాదేవి.
'బీడబ్ల్యూఎఫ్' అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు
పి.వి సింధు .. ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశానికి సుపరిచితం. భారత స్టార్ షట్లర్ అయిన ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలయ్యారు. ఆరుగురు సభ్యుల జాబితాలో ఆమె స్థానం దక్కించుకోవడం మామూలు విషయం కాదు. సింధు 2025 వరకు ఆ కమిషన్‌లో సభ్యురాలిగా ఉంటారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యోలో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.
సింధు పూర్తిపేరు పూసర్ల వెంకట సింధు. ఆమె జూలై 5, 1995న పి.వి.రమణ, పి.విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఒకప్పుడు ఆంధ్రప్రాంత వాసులు. ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించి, పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలారామె. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని, మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆగస్టు 10, 2013న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పతకం సాధించారు సింధు. ఆ టోర్నీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. మార్చి 30, 2015న భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీని ప్రధానం చేసింది. ఆగస్టు 18, 2016న రియో ఒలింపిక్స్‌లో జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచారు. ఇలా ఆమె ఖాతాలో ఎన్నో అవార్డులు, రివార్డులు చేరాయి.
వందేళ్ల చరిత్రను తిరగరాశారు
వందేళ్ల ఉస్మానియా వర్సిటీ చరిత్రలో నూతన అధ్యాయమిది. ఆదివాసీ మహిళలు తలుచుకుంటే ఎందులోనూ, ఎవ్వరికీ తీసిపోరని ఆదివాసీ (కోయ) బిడ్డ డాక్టర్ గుమ్మడి అనురాధ నిరూపించారు. న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమైన తొలి ఆదివాసీ మహిళగా రికార్డును సాధించారు. బషీరాబాగ్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆమె ఈ మధ్యే బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి ఉన్నత ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న ఏకైక ఆదివాసీ మహిళ అనురాధ కావడం విశేషం. ఉస్మానియా వర్సిటీ వందేళ్ల చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసి (కోయ) మహిళ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. అనూరాధ తండ్రి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఆయన ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సాధారణ జీవితం గడుపుతున్నారు.
బీహార్ తొలి ముస్లిం మహిళా డీఎస్పీ
బీహార్ 64వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన రజియా సుల్తానా రాష్ట్రంలో డీఎస్పీ పోస్టుకు ఎంపికైన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. గోపాల్ గంజ్ జిల్లా హథురా ప్రాంతానికి చెందిన రజియా ఇటీవల డీఎస్పీగా ఎంపికై, చరిత్ర సృష్టించారు. ఈ 27 ఏళ్ల యువతి ప్రస్తుతం బీహార్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. 2017లో విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరిన ఆమె, అనంతరం బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు సిద్ధమయ్యారు. 'నేను పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రజలకు న్యాయం జరగని సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో చాలా వరకూ న్యాయం జరగని సందర్భాలే. మహిళలు తమపై ఏదైనా నేర సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు నివేదించేందుకు భయపడుతున్నారు. కొందరు సిగ్గుపడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మార్పు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తాను!' అంటున్నారు రజియా సుల్తానా.
ఉమెన్ ఆఫ్ ది ఇయర్
లాంగ్‌జంప్‌లో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించారు అంజూ బాబీ జార్జ్. ఆమె రిటైరైన తర్వాత యువతుల కోసం శిక్షణా సంస్థను నెలకొల్పి వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. భారత్‌లో క్రీడల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషితో పాటు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తూ, లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. అందుకుగాను వరల్డ్ అథ్లెటిక్స్ 2021వ ఏడాదికి గానూ అంజూకు ప్రతిష్టాత్మకమైన 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అండర్-20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో రాటుదేలిన పలువురు యువతులు పతకాలు గెలుపొందారు.
లైన్ ఉమెన్
పదిమందిలో ఒకరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకున్నారు ఆ యువతి. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణించగలరని నిరూపించాలనుకున్నారు. పట్టు పట్టి ఐటీఐలో చేరారు. ఆమే తెలంగాణా సిద్ధిపేట జిల్లా గణేశపల్లికి చెందిన బబ్బూరి శిరీష. ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ లైన్‌మెన్ నియామకాల్లో ఆడవారికి అవకాశం ఇవ్వకపోవడంతో.. మహిళల పట్ల వివక్ష ఎందుకంటూ కోర్టు మెట్లు ఎక్కారామె. అలా పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఫలితాల కోసం మరోసారి, ఉద్యోగం కోసం ఇంకోసారి.. కోర్టుకెళ్లి తన హక్కుల్ని సాధించుకుని, విజేతగా నిలిచారు. తెలంగాణ తొలి లైన్ ఉమన్‌గానే కాక దేశంలోనే ఈ విభాగంలో తొలి ఉద్యోగిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు శిరీష. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతినూ లైన్ ఉమెన్‌గా ఎంపికయ్యారు.
'మా మేనమామ శేఖర్‌గౌడ్ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చాడు. ఇంట్లో తాడుతో స్తంభాలు ఎక్కే విధానం, ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లోని సబ్‌స్టేషన్‌లో పోల్ ఎక్కడం నేర్పాడు. రేషన్ బియ్యం తప్ప ఇతర పోషకాహారం లభించని దయనీయ స్థితిలో ఉన్న నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం పోషకాహారం సమకూర్చాడు. దాదాపు ఆరునెలలు సాధన చేశాను. రోజు మొత్తం వ్యవసాయం పనులు చేయగల నేను నిమిషం సమయంలో పోల్ ఎక్కడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు' అంటున్నారు శిరీష. 'ఇద్దరు పిల్లల తల్లిని. ఎనిమిదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. తండాల్లో పుట్టి పెరిగినదాన్ని. చెట్లు ఎక్కి దిగడం చిన్నప్పటి నుంచీ అలవాటే. ఆ ధైర్యంతోనే స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు విన్నవించుకున్నా. అయినా పోల్ టెస్ట్‌కు ముందు వరంగల్‌లోని ఎన్‌పీసిఎల్ గ్రౌండ్‌లో నెల రోజుల పాటు రోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాను' అంటున్నారు భారతి.