Jul 18,2021 12:26

కొత్తగా వచ్చిన కోరికల నిచ్చెనల అండ చూసుకొని
అవకాశాల ఆకాశం రా రమ్మని ఆహ్వానిస్తోందని
ఆనందంతో ఆదమరచి అన్వేషణ కొనసాగించా
నా ఆలోచనలను ఎవరూ ఆక్షేపించని చోటు కోసం
నా అనుభవాలను ఎవరూ అవమానించిన మాటు కోసం

కొత్తగా మెరుస్తున్న ఆశల నక్షత్రాల వెలుగులు చూసుకొని
కలల సముద్రాల అలలు రారమ్మని పిలుస్తున్నాయని
ఆవేశంతో ఆలోచన మరచి వెతుకులాట ప్రారంభించా
నా ఆదర్శాలను ఎవ్వరూ అపహాస్యం చెయ్యని నీడ కోసం
నా ఆత్మాభిమానాన్ని ఎవరూ అపార్థం చేసుకోని గూడు కోసం

కొత్తగా మొలిచిన మధుర స్వప్నాల రెక్కలను చూసుకుని
వయసు వర్ణాల ఇంద్రధనస్సు రారమ్మని కవ్విస్తోందని
అమాయకంగా అలుపెరగని పయనం కొనసాగించా
నా అవకాశాలను ఎవ్వరూ దోచుకోని తావు కోసం
నా ఆనందాలను ఎవ్వరూ అడ్డుకోని మావి కోసం

వెతికి వెతికి అలసిపోయి ఊపిరి ఆవిరి అవుతుంటే
రెండడుగులు దానం చేసే బలి చక్రవర్తులు కానరాక
అవనిపై కాలుమోపే ఆశలు అడియాశలు అవుతుంటే
ఆయువులు అనంత లోకాల్లో కలిసి ఎగిరిపోతుంటే
ఆకాశం మాత్రం హాయిగా నవ్వుతోంది
నే కోరుకున్న త్రిశంకుస్వర్గం లేనేలేదన్నట్లు

ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985