ఆదిలో అనుకూలించి ముఖం చాటేసిన వర్షాలు
నిలకడగా ఖరీఫ్ వరి నాట్లు వేస్తున్న రైతన్నలు
ప్రజాశక్తి -భీమునిపట్నం ఈ ఏడాది ఖరీఫ్ తొలిరోజుల్లో ఆడపాదడపా అయినా, ఆశాజనకంగా కురిసిన వర్షం, రెండు వారాలుగా ముఖం చాటేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా వర్షాధార సాగుపై ఆధారపడిన భీమిలి వ్యవసాయ డివిజన్‌లో జూన్, జులైలో సాదారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కురవడంతో నారుపోయడం, నాట్లు వేయడం వంటి పనులు చకచకా చేసిన అన్నదాతలు, ఇపుడు వర్షం ఎత్తిపెట్టడంతో ఆకాశానికేసి చూస్తున్నారు. భీమిలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఈ ఏడాదే కాదు, ఎపుడూ రైతాంగం ప్రస్తుతం చుక్క చినుకు కోసం ఆకాశం వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితులు తప్పడం లేదు.
సాదారణం కంటే ఎక్కువగానే వర్షపాతం
ఈ ఖరీఫ్ ఆదిలో ఈ ఏడాది ఖరీఫ్ తొలినాళ్లలో అంటే జూన్ మొదలుకొని జూలై 21 వరకూ అనుకూల వర్షాలు కురిశాయి. మండలాల వారీగా జూన్, జూలైలో చూసినట్లయితే భీమిలిలో సాధారణ వర్షపాతం 189 మిల్లీమీటర్లు కాగా 213.9 మిల్లీమీటర్లు నమోదైంది. ఆనందపురంలో 182.7 మిల్లీమీటర్లు కాగా, 220.3 మిల్లీమీటర్లు నమోదైంది. పద్మనాభంలో 249.4 మిల్లీమీటర్లు సాదారణం కాగా, 344.3 మిమీ.నమోదైంది. విత్తనాలు చల్లేందుకు, నాట్లు వేసేందుకు జూలై 21 వరకు కురిసిన వర్షాలు దోహదపడ్డాయని చెప్పొచ్చు.
నిలకడగా వరినాట్లు
ఈ ఏడాది మే మొదలు జులై 15వరకు ఖరీఫ్ మొదట్లో భీమిలి డివిజన్‌లోని మూడు మండలాల్లో అడపాదడపా కురిసిన వర్షానికి వేగంగా నార్లు వేయగా, ఉడుపులు మాత్రం నిలకడగా సాగుతున్నాయి. భీమిలి మండలంలో వరిపంట సాధారణ విస్తీర్ణం 1352 ఎకరాలు కాగా, 135 ఎకరాల్లో నార్లు వేయగా, సుమారు 20ఎకరాల్లో ఉడుపులు సాగాయి. మొక్కజొన్న 157 ఎకరాలకు గాను 25 ఎకరాలు, వేరుశెనగ 145 ఎకరాలకు గాను 100 ఎకరాలు, నువ్వులు 128 ఎకరాలకు గాను 125 ఎకరాల్లో పంట వేశారు.
ఆనందపురం మండలంలో వరి సాధారణ విస్తీర్ణం 1585 ఎకరాలకు గాను, 159 ఎకరాల్లో నార్లు వేయగా, సుమారు 25 ఎకరాల్లో నాట్లు వేశారు. మొక్కజొన్న 30 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, ఎక్కడా పంట వేయ లేదు. వేరుశెనగ 90 ఎకరాలకు గాను, 25 ఎకరాలు, నువ్వులు 198 ఎక ాలకు గాను 62 ఎకరాల్లో మాత్రమే పంట వేశారు.
పద్మనాభం మండలంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 6,282 ఎకరాలు కాగా, 628 ఎకరాల్లో నార్లు వేయగా, సుమారు 80 ఎకరాల్లో ఉడుపులు వేశారు. మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 65 ఎకరాలకు గాను,5 ఎకరాలు, వేరుశెనగ 80 ఎకరాలకు గాను, 25 ఎకరాలు,నువ్వులు 802 ఎకరాలకు గాను 743 ఎకరాల్లో పంట వేశారు. చెరకు సాధారణ విస్తీర్ణం 302 ఎకరాలు కాగా, 70 ఎకరాల్లో పంట వేశారు.
ఖరీఫ్ ఆశాజనకంగా ఉండొచ్చు...
సరిపడా వర్షాలు కురిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో 47 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1377 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు అందించాం. ఇందులో బిపిటి 5204, 3291, ఎంటియు 1121, ఆర్‌జిఎల్ 2537 రకం వరివంగడాలను రాయితీపై అందజేశాం.
బొడ్డేపల్లి విజయప్రసాద్,
ఎడిఎ, భీమిలి సబ్‌డివిజన్










