Sep 03,2023 00:33

నిత్యావసర సరుకుల

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. భారాల దెబ్బకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి దాపురించింది. స్కూల్‌ ఫీజులు దగ్గర నుంచి ఇంటి రెంట్లు, హాస్పిటల్‌ ఖర్చులు, కూరగాయలు, పప్పు దినుసులు, గుడ్లు, వంట నూనెలు, నిత్యావసరాలు ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడాపెడా ధరలు, పన్నులు, చార్జీలు భారం మోపుతున్న కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రోజురోజుకి నిత్యావసర ధరలు అదుపు లేకుండా ఆకాశాన్నంటు తుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అల్లాడి పోతున్నారు.వచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే నెల తిరిగేసరికి అప్పులతో కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతులేకుండా పెరుగుతూనే ఉన్నాయి.
పప్పులు, ఉప్పుల నుంచి వంట నూనెలు, కూరగాయల దాకా అన్ని రేట్లు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు రూ.40 నుంచి రూ.60 వరకు ఉన్నాయి. నాన్‌ వెజ్‌ ధరలు కూడా పెరిగి పోయాయి. గతేడాది కంది పప్పు కిలో రూ.120 ఉంటే ఇప్పుడు రూ.140 నుంచి రూ.165 ఉంది. పెసర పప్పు, మినపప్పు కూడా కిలోకు రూ.20 నుంచి రూ.30 దాకా పెరిగింది. ఇంట్లో అవసరమైన ప్రతి నిత్యావసర వస్తువు ధర ఏడాదిలోనే 15 శాతం నుంచి 25 శాతం మేర పెరిగాయి. ఇంట్లో నెల అవసరాలకు యావరేజ్‌ రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చు అవుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో దాని ఎఫెక్ట్‌ ఇంటి అద్దెల మీద కూడా పడుతోంది. డివిజన్‌, మండల కేంద్రాల్లో సింగిల్‌ బెడ్రూమ్‌ ఇంటికి నెలకు రూ.4 వేల నుంచి 6 వేలు ఉండగా.. అదే జిల్లా కేంద్రంలో ఏరియాను బట్టి అంతకంటే ఎక్కువే ఉంది. వీటికి అదనంగా కరెంట్‌ బిల్లులు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా పెద్ద మొత్తంలోనే ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కరోనా తర్వాత హార్ట్‌ అటాక్‌, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగి పోయాయి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. హాస్పిటల్కి వెళ్లి, ఓపీ చూపించుకుంటే రూ.300 ఖర్చు అవుతుంది. టెస్టులు, మెడిసిన్సక్కు అదనంగా పెట్టాల్సి వస్తుంది.
గుదిబండగా స్కూల్‌ ఫీజులు..
పేద, మధ్య తరగతి కుటుంబాలకు స్కూల్‌ ఫీజులు గుదిబండగా మారాయి. ప్లే స్కూల్‌ నుంచి ఇంటర్మీడియేట్‌ వరకు స్కూల్‌, కాలేజీని బట్టి 20 శాతం నుంచి 30 శాతం ఫీజులు పెంచారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో ఏడాదికి రూ.60 వేలు, కార్పొరేట్‌ స్కూలైతే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజు ఉంది. నిత్యవసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కారణంగా చూపుతూ స్కూల్‌ ఫీజులను పెంచారు. పుస్తకాలు, యూనిఫామ్లకు అయ్యే ఖర్చులు అదనం అవుతుంది.