ప్రజాశక్తి - తాళ్లరేవు
తఅకాల వర్షానికి ధాన్యం తడిసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరకడమే కాకుండా కళ్లాలపై రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. తాళ్లరేవు రెడ్డివారి పేట సమీపంలో జాతీయ రహదారి 216 చెంతన పలువురు రైతులు తడిసిన ధాన్యాన్ని సోమవారం ఆరబెట్టారు. ఈ సందర్భంగా రైతులు మట్టపర్తి సత్తిబాబు తదితరులు విలేకరుల వద్ద తమ గోడు వినిపించారు. వేసవికాలం కావడంతో పి.మల్లవరం ,పోలేకుర్రు తదితర ప్రాంతాల్లో సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని జాతీయ రహదారి చెంతన ఖాళీ స్థలంలో వేలాది బస్తాలు ధాన్యం రాశులుగా పోశామన్నారు. ధాన్యం రాశుల్లోకి వర్షం నీరు వెళ్లి పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. తాళ్లరేవు తహశీల్దార్ పోతురాజును వివరణ కోరగా తడిసిన ధాన్యాన్ని ఆయా అధికారుల ద్వారా పరిశీలించి రైతాంగానికి మేలు కలిగేలా తదుపరి చర్యలు చేపడతామన్నారు.
తాళ్లరేవులో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు










