Nov 01,2023 22:54

ప్రజాశక్తి - చాగల్లు మండలంలో పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం చెదురు మధురగా అకలా వర్షం పడింది. దీంతో ఇప్పటికే వరి కోతలు కోసి ధాన్యంను రోడ్లపై రాశులుగా పోసి ఆరబెట్టిన పలువురు రైతులు ఇక్కట్లకు గురయ్యారు. ఉన్నఫలంగా వర్షం రావడంతో రైతులు బరకాల కోసం పరుగులు తీశారు. పండిన పంట రాశులుగా పోసి సిద్ధం చేసినా కొనుగోలు ప్రారంభించకపోవడంతోనే ఇబ్బందులు ఎదురౌతున్నాయని కౌలు రైతు బెల్లం సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధాన్యం బస్తాను కేవలం రూ.1300లకు మాత్రమే అడుగుతున్నారని ఆయన తెలిపారు. మండలవ్యవసాయ అధికారి కె.గోపాలకష్ణ వివరణ కోరగా మండలంలో 7,500 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతానికి 200 ఎకరాల్లో మాత్రమే కోతలు కోశారని తెలిపారు. ప్రస్తుతానికి రోడ్లపై సుమారు 40 ఎకరాలకు సంబంధించిన ధాన్యం మాత్రమే రాశులుగా ఉందని తెలిపారు. బుధవారం మండలంలోని మల్లవరం, చంద్రవరం, దారవరం, బ్రాహ్మణగూడెం, కలవలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోల్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ధాన్యము కొనుగోలు కేంద్రం ద్వారా 75 కేజీల బస్తా 17 శాతం ఆరుదల ఉంటే రూ.1635 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం 5 ట్రాక్టర్‌ ధాన్యంను రైస్‌ మిల్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.