May 06,2023 21:41

cartoon

అకాల వర్షం.. అపార నష్టం..
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

    ఉదయం ఉక్కపోత, ఎండ వేడిమి భగభగమంటూనే మరో వైపు సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా వ్యాప్తంగా కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అన్నదాతకు నష్టాలను మిగిల్చింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పలు పంటలు నేలకొరిగాయి. మామిడి, బొప్పాయి కాయలు గాలివానకు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. మిర్చి కోతకు రావడంతో కోసి ఆరబోసిన మిర్చి తడిసి పాడయింది. వరి పొలాల్లో నీరు చేరడంతో పైరు నీట మునిగింది. అకాల వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న యువగళం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. తొలుత డోన్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ముగిసింది. ప్రస్తుతం కర్నూలు నియోజకవర్గంలో సాగుతోంది. అడుగడుగునా పలు వర్గాలు, గ్రామస్తులు, పలు సంఘాల ప్రతినిధులు లోకేష్‌ ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
జెఇఇ మెయిన్స్‌ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు జెఇఇ మెయిన్స్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులను సాధించారు. ఈ మెయిన్స్‌ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపి అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. చిన్నటేకూరు సాంఘిక సంక్షేమ గురుకుల అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ఆకాడమీకు చెందిన పది మంది విద్యార్థులు 90 శాతం పర్సంటేజ్‌ సాధించారు.
ఎర్ర జెండా రెపరెపలు..
కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎర్ర జెండా రెపరెపలాడింది. కార్మిక సంఘాల నాయకులు అరుణ పతాకాలను ఎగురవేశారు. మేడే స్పూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
మళ్ళీ ట్రూ అప్‌...
ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్తు వినియోగదారులపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత 9 నెలలుగా ట్రూఅప్‌ (సర్దుబాటు) ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.. దీనికి అదనంగా ఈనెల నుంచి మరికొంత వసూలు చేయాలని నిర్ణయించారు. ఏపీఈఆర్సీ నుంచి రెండో విడత సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసేందుకు ఇప్పటికే అనుమతి వచ్చింది. ఇందులో భాగంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి డిస్కంకు వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయనున్నారు. 2021-22 ఏప్రిల్లో వాడిన యూనిట్లపై ట్రూఅప్‌ భారాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో కలపనున్నారు. ఏ నెలకు సంబంధించిన బిల్లును ఆ నెల వసూలు చేయనున్నారు. అప్పట్లో అధికంగా విద్యుత్తు వాడకం ఉంటే ప్రస్తుతం అందుకు సంబంధించిన భారం సామాన్యులపై పడనుంది.