Mar 18,2023 22:08

రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు
వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, పొగాకు పంటలకు నష్టం
దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి
కళ్లాల్లోని మిర్చిని కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
లబోదిబోమంటున్న అన్నదాత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

అకాల వర్షం అన్నదాతను వణికిస్తోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా చివరి దశకు చేరుకున్న వరి, మామిడి, మిర్చి, మొక్కజొన్న, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులకు ఏం చేయాలో అర్థంకాని దుస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లోనూ దాదాపు 3.60 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. పంటంతా పొట్ట, ఈనిక దశలో ఉంది. ప్రస్తుతం ఈనిక దశలో వర్షాలు కురుస్తుండటంతో కంకుల మీద ఉన్న సొంపు రాలిపోయి పొల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రబీలో ఈనిక దశలో వర్షాలు కురిస్తే మెడ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులకు వరి పొలాలు నేలనంటే ప్రమాదం ఉండటంతో అన్నదాత గుబులు చెందుతున్నాడు. మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు గుబులు చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంటంతా చివరి దశకు చేరింది. సాగునీటి కోసం అధిక పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. వర్షాలతో పంట దిగుబడి తగ్గితే పెట్టుబడులు రావడం కూడా కష్టంగా మారే పరిస్థితి ఉందని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అన్ని పంటలకూ నష్టమే
జిల్లాల విభజన తర్వాత ఏలూరు జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. పంటంతా పూత, పిందె దశలో ఉంది. అకాల వర్షాలు మామిడి పంటను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి నెలకొంది. తామర తెగులు, మచ్చతెగులు విజృంభించే అవకాశం ఉందని ఉద్యానవన శాఖాధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. అందుకు సంబంధించిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా చలిగాలులు, వర్షాలకు మామిడిపూత రాలిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన మామిడి రైతులు అకాలవర్షాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పంటంతా కోత దశకు చేరింది. వర్షాలకు, గాలులకు మొక్కజొన్న మొక్కలు పడిపోవడం, కంకులకు బూజు తెగులు వంటి సమస్యలు తలెత్తనున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా దిగులు చెందుతున్నారు. విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడుతోపాటు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. పంటంతా కోత దశకు చేరడంతో రైతులు పంట కోసి ఒబ్బిడి చేస్తున్నారు. కళ్లాల్లో ఉన్న పంటంతా అకాల వర్షాలకు తడిసి ముద్దవుతోంది. కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు, రేపాకగొమ్మి, రుద్రమ్మకోట, తిరుమలాపురం, చిగురుమామిడి, నార్లవరం, వసంతవాడ వంటి గ్రామాల్లో రైతులు పండించిన మిర్చిని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టార్ఫిన్లతో కప్పి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. పంట తడిస్తే ధరపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో రైతులు గుబులు చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. పొగాకు ప్రస్తుతం చాలాచోట్ల కోసి పన దశలో ఉంది. వర్షాలకు తడిచి ఆకులోని రసం అంతా కిందకు దిగిపోనుంది. దీంతో పంట నాణ్యత దెబ్బతిని ధరపై తీవ్ర ప్రభావం చూపనుంది. అకాల వర్షం అన్ని పంటల రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అకాల వర్షాలతో సోకే తెగుళ్లపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించి పంటను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.