అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న
- తీవ్రంగా నష్టపోయిన రైతులు
ప్రజాశక్తి - పగిడ్యాల
పగిడ్యాల మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. రేయినక పగలనక కష్టపడి పంటలు పండిస్తే ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నాశనమై అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. రబీలో సాగు చేసిన పంటలు మొక్కజొన్న, ఎండుమిర్చి తడిసిపోయయి. తెల్లవారుజామున వర్షం రావడంతో రైతులు ఆరబోసిన పంటలను టార్పాలియన్లతో కప్పుకోలేక కళ్లెదుటే పండించిన పంట తడిసిపోతుంటే రైతుల బాధ వర్ణనాతీతం. మండలంలో రబీ సీజన్‌లో 1490 ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. వర్షానికి తడిసిన పంట నాణ్యత లోపించి ధర తక్కువకు అమ్మడపోతుందని, తీవ్రంగా నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిన పంటను గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుకోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.










