ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: ద్రోణి ప్రభావంతో గత మూడు రోజుల నుంచి ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షానికి రైతన్న కుదేలవుతున్నాడు. ఆరు కలలు కష్టపడి పండించిన పంట చేతికందే టైంలో ప్రకృతి కోపానికి పంట నేల పాలవుతుంది అని రైతులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో నక్కబొక్కలపాడు, కొనిదెన, కొప్పరపాలెం, మల్లయ్య పాలెం, బల్లికురవ, గుంటుపల్లి, అంబడిపూడి, చెన్నుపల్లి, కొమ్మినేనివారిపాలెం తదితర గ్రామాలలో మొక్కజొన్న పైరు అధికంగా సాగు చేశారన్నారు. మొక్కజొన్న పైరు కొంత కోత దశకు చేరుకోగా మరికొంత గింజ దశలో ఉందన్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో పాటు వీచిన గాలులకు పలుచోట్ల మొక్కజొన్న పైరు పూర్తిగా నేలకు ఒరిగిందని పేర్కొన్నారు. ఏటా ప్రకృతి కోపానికి అన్నదాతకు కన్నీరే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం స్పందించి పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మండల రైతాంగం కోరుతున్నారు.










