May 01,2023 21:36

చాగలమర్రి మండలంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున రైతులు
చాగలమర్రిలో పూర్తిగా తడిచిన పసుపు పంట
చాగలమర్రిలో పూర్తిగా తడిచిన పసుపు పంట

అకాల వర్షాలతో రైతన్న అతలాకుతలం
- రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో కురిసిన వర్షం
- వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
- తడిచి ముద్దయిన మొక్కజొన్న, వరి, పసుపు
ప్రజాశక్తి - రుద్రవరం

      ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. రుద్రవరం మండలంలో రబీ సీజన్లో రైతులు వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మినుము పంటలను సాగు చేశారు. ముందుగా కొందరు రైతులు సాగు చేసిన పంటలను కోత కోసి ధాన్యం ఇళ్లకు చేర్చుకొని విక్రయించుకున్నారు. ఆలస్యంగా పంటలు సాగు చేసిన రైతులు మాత్రం తీవ్రంగా పంటలను నష్టపోతున్నారు. చిన్న కంబలూరు, పెద్ద కంబలూరు, అప్పనపల్లి, డి కొట్టాల, బి.నాగిరెడ్డిపల్లి, రుద్రవరం, కొండమాయపల్లి, ఆర్‌.నాగులవరం, టి.లింగందిన్నె తదితర గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు వరి పంట పూర్తిగా నేలకొరిగింది. అలాగే కొందరు రైతులు వరి పంటను ఆరబెట్టుకుంటూ ఉండగా వర్షం కురవడంతో పూర్తిగా తడిసిపోయి పంట దెబ్బతినింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసి చివరకు చేతికందే సమయంలో ఇలా అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. చాగలమర్రి : చాగలమర్రి మండలంలో ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం తెల్లవారుఝాము వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 8.67 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. చాగలమర్రి పట్టణంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వర్షం నీరు రహదారిలపై భారీగా ప్రవహించింది. అలాగే మండలంలోని శెట్టివీడు, చింతలచెరువు, పెద్దవంగలి, చిన్నవంగలి తదితర గ్రామాలలో కళ్ళాలో ఉంచిన పసుపు, మొక్కజొన్న, వరి, కొర్రలు ధాన్యం తడిసి ముద్ద అయ్యాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.