అకాల వర్షాలతో
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నంద్యాలలోని నరసింహ భవన్‌లో ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు టి.రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులో మోసం చేశాయని విమర్శించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని చెప్పారు. ఫలితంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి రైతులపై భారం పడుతుందన్నారు. ఎఫ్‌సిఐకి కేటాయించే నిధుల్లో కోత విధించడం వల్ల రైతుల పంటలు వరి, గోధుమ మద్దతు ధరలు అమలు చేయని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల స్థిరీకరణ నిధులు కేటాయించకపోవడంతో మద్దతు ధరలు అందడం లేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల నుండి రైతన్నను ఆదుకోవడం లేదన్నారు. పంటల బీమా సక్రమంగా అమలు చేయడం లేదని, ఫలితంగా రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలన్నారు. నేషనల్ హైవే రోడ్లు, ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల మిరప, మొక్కజొన్న, అరటి, మామిడి, బత్తాయి, ఉల్లి పంటలు త్రీవంగా దెబ్బతిన్నాయని, రైతులు నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు రైతులతో కలిసి నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు రామేశ్వరరావు, రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










