బొమ్మనహల్ : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసన వర్షానికి వరి పంట నేలకొరింది. కృష్ణాపురం, మైలాపురం, ఉద్దేహళ్, దేవగిరి, గోనెహళ్, శ్రీధరఘట్ట, సింగేపల్లి, కళ్లుదేవనహళ్లి, పొన్నూరు గ్రామాల్లో హెచ్‌ఎల్సీ ఆయకట్టు కింద రైతులు వరి పంటను సాగు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఈ పంట నేలకొరిగింది. మండల వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. కోతకోసి కుప్పలుగా వేసిన మొక్కజొన్న కూడా పలు ప్రాంతాల్లో తడిసిపోయింది. ఇది కూడా 200 ఎకరాల పంట తడిసిపోయినట్లు తెలుస్తోంది. పంట సాగు కోసం రైతులు ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకు పూర్తిగా నేలకొరిగింది. హెచ్‌ఎల్సీ కింద సాగుచేసిన చివరి ఆయకట్టుకు నీరందక గత నెలలో పంట మొత్తం ఎండిపోయింది. ఇక వేరుశనగ, కొర్ర, కంది పంటలు వర్షాలు లేక ఎండిపోయాయి. ఈ ఏడాది పంటలన్నీ ఏదో రూపంలో చేతికందకుండా పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నాలుగు నెలల పాటు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటను అంచనా వేసి, నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.