పదిహేనేళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం తాను చదువుతున్న పాఠశాల ముందు ధర్నా చేసి 'ఆజాద్'గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్. 'ఇప్పటికీ మీ రక్తం మరగకపోతే, మీ సిరల్లో ప్రవహించేది నీరు మాత్రమే' అని యువతను చైతన్యవంతులను చేశాడు. స్వాతంత్య్ర సమరంలో దశాబ్దం పాటు ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమైనది. పేదరికంలో పుట్టిన ఆజాద్‌కు చిన్నతనంలోనే శ్రమ విలువేమిటో తెలుసు. చిన్నవయసులోనే బొంబాయిలో కార్మికుడుగా పని చేసినందున కష్టజీవుల సాధక బాధకాలు బాగా తెలుసు. అందువల్లే రైతులు, కార్మికుల రాజ్య స్థాపన గురించి జరిగే చర్చల్లో ఆసక్తిగా పాల్గొనేవాడు. అయితే నేటి యువత, ప్రజలు...నిత్యావసర వస్తువులు, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల పట్ల కూడా కనీసం ఆలోచన చేయకపోవడం, నిరసన వ్యక్తం చేయకపోవటం శోచనీయం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలు, సమావేశాలు పట్ల ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తుంది. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి వంటి ఎంతోమంది యువ కిశోరాలు...అరవై సంవత్సరాలు పైబడిన తిలక్, లాలా లజపతిరారు వంటి వారు చేసిన త్యాగాలను మననం చేసుకోవాలి. సుమారు 7 నెలల పైబడి దేశ రాజధాని ఢిల్లీలో చేస్తున్న రైతు పోరాటం, విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, వలస కార్మికుల వెతలు, కోవిడ్ కాలంలో కార్మికుల హక్కుల సవరణలు, 124-ఏ రాజద్రోహం కేసులు...తదితర అంశాలపై యువత నడుం బిగించాలి. పరిష్కారం కోసం నేటి తరం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలి. ''నేను ప్రాణాలతో వుండగా, నా శరీరాన్ని ఎవరూ ముట్టలేరు'' అన్న ఆజాద్ తెగువను నేటితరం అలవర్చుకోవాలి. 'నా పేరు-ఆజాద్, నా తండ్రి-స్వాతంత్య్రం, నా నివాసం-కారాగారం'' అని పదిహేను సంవత్సరాల వయసులోనే పలికిన ఆజాద్ మాటల స్ఫూర్తితో...యువతరం నేటి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అదే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.
- ప్రసాదరావు










