ప్రజాశక్తి-చీరాల, బాపట్ల జిల్లా: చీరాల ఐటిసి కంపెనీ వారు తమ రోజు వారీ అవసరాల కోసం మున్సిపాలిటి నుంచి 3 లక్షలకు పైగా తాగునీరు కావాలని చీరాల పురపాలక సంఘాన్ని కోరారు. రోజువారి ప్రజావసరాలతో ముడిపడి ఉన్న తాగునీటి సరఫరా అంశం గురించి సాధ్యాసాధ్యాలు, భవిష్యత్‌లో వచ్చే ఇబ్బందుల గురించి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవలసిన మున్సిపల్ కౌన్సిల్ హడావిడిగా ఐటిసి వారికి తాగునీరు ఇచ్చేందుకు ఆమోదం తెలపడం విమర్శలకు తావిచ్చింది. స్థానిక ఐటిసి వారు తమ కంపెనీలో 2 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, కంపెనీ నిర్వహణలో ప్రాసెసింగ్, డ్రింకింగ్, కుకింగ్, ఇతర అవసరాల కోసం ప్రతి రోజూ 3 లక్షల 20 వేల లీటర్ల నీటిని తమ కంపెనీ ఆవరణలో ఉన్న బావుల ద్వారా వినియోగిస్తున్నామని, కాని సదరు నీటిలో టిడిఎస్ పెరగడం వలన ఈ నీరు ఉపయోగపడడం లేదని తెలిపారు. అందువలన చీరాల పురపాలక సంఘం ద్వారా ప్రతి రోజూ 3 లక్షల 20 వేల లీటర్ల నీటిని తమకు సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు పురపాలక సంఘ బైలా ప్రకారం చెల్లించవలసిన చార్జీలను చెల్లిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం రాగా ప్రజల అవసరాలతో ముడిపడి ఉన్న ఈ అంశం గురించి అన్ని విధాలా కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు ఇదేదో అత్యవసర అంశంలాగా ఆమోదం చెప్పారు. కౌన్సిల్‌లో ప్రతిపక్ష సభ్యులు వద్దు అన్నారు కనుక తాము ఆమోదిస్తాం అన్నట్లుగా చేశారు. ఒక దశలో ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఈ అంశాన్ని వాయిదా వేసి కూలంకషంగా చర్చించి వచ్చే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుందామని అన్నప్పటికీ అధికార పక్ష కౌన్సిలర్లు వాయిదాకు వెళ్లకుండా ఆమోదం తెలిపారు. ఇలా హడావిడిగా అంశాన్ని ఆమోదించడం వెనుక ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్లయింది. అసలు ప్రతి నెల జరిగే కౌన్సిల్ సమావేశం ముందు అధికారపక్ష కౌన్సిలర్లు సమావేశమయి ముఖ్యమైన అంశాల గురించి చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకావాలి. కాని ఈ సాంప్రదాయాన్ని ప్రస్తుత అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు పాటిస్తున్న పరిస్థితి లేదు. ఈ కారణంగా పలు అంశాలపై కౌన్సిల్ సమావేశంలో వారిలో వారే వాదోపవాదాలకు దిగడం పరిపాటి అయింది. ఐటిసి వారికి తాగునీరు సరఫరా విషయంలో కూడా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కౌన్సిల్‌లో పెత్తనం చేస్తున్న ఇద్దరు, ముగ్గురు అధికార పక్ష కౌన్సిలర్ల అభిప్రాయం పరోక్షంగా ఎమ్మెల్యే చెప్పిన మాటగా చెబుతున్నందున మిగతావారు మనకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. ఈ కారణంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఆమోదానికి వెళ్లి వివాదం అవుతున్నాయి. ఇలా పట్టణ ప్రజానీకం అవసరాలను ఫణంగాపెట్టి ఐటిసికి మంచినీటిని సరఫరా చేయడం వలన భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని తెలుస్తుంది. చీరాల పట్టణానికి తాగునీరు సరఫరా చేసే రక్షిత చెరువు పూర్తి నీటి సామర్థ్యం 22 అడుగులు ఉంటే 1,450 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం దాదాపు చెరువు నిండుగానే ఉంది. కొమ్మమూరు కాలువలో నీరు ప్రవహిస్తున్నంత వరకు చెరువుకు నీటి సరఫరా ఉంటుంది. మున్సిపల్ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి రోజూ పట్టణ ప్రజల నీటి అవసరాల కోసం 7 మిలియన్ లీటర్ల నీరు అందిస్తున్నారు. ఐటిసి వారు అడుగుతున్నది రోజుకు 0.32 ఎమ్‌ఎల్‌లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 4 నెలల పాటు వస్తాయి. చాలా కాలంగా వర్షాలు పడటం లేదు. కొమ్మమూరు కాలువకు కూడా నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే జూలై నాటికి చెరువులో నీరు అడుగంటుతాయి. మళ్లీ వర్షాలు దండిగా కురిసి పైన సాగర్ డ్యామ్ నిండి, కృష్ణా నదిలో నీటి ప్రవాహం వస్తేనే కొమ్మమూరుకు నీటి సరఫరా జరుగుతుంది. ఈ వేసవిలో ప్రజల నీటి వినియోగం పెరుగుతుంది. చెరువులో నీరు కూడా అధిక ఉష్ణోగ్రతలకు ఆవిరి అవుతుంది. ఒకవేళ వర్షాలు పడకపోతే నీటి ఎద్దడి వస్తుంది. అప్పుడు పట్టణ ప్రజలకు ఒక పూట నీరు ఇవ్వడం కూడా గగనమవుతుంది. అప్పుడు ఐటిసి కంపెనీకి నీరు ఇవ్వడం వల్లనే చెరువులో నీరంతా అయిపోయాయని ప్రజలంటారు. అధికార పక్షం దగ్గర జవాబు ఉండదు. ప్రజలతో ముడిపడి ఉన్న అంశాలపై అన్ని విధాలా ఆలోచించాలి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతిమంగా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. కాని ఐటిసి కంపెనీ కోసం హడావుడి నిర్ణయాలు భవిష్యత్‌లో ఇబ్బందులను కొనితెస్తాయి. ఐటిసి కంపెనీ దేశంలోనే అతి పెద్ద కంపెనీ. వారు కావాలంటే కృష్ణా నది నుంచి లేదా కొమ్మమూరు కాలువ నుంచి నేరుగా పైప్‌లైన్ నిర్మించుకొని తమకు కావలసిన నీరు రాబట్టుకోగలరు. పురపాలక సంఘానికి సొమ్ములు వస్తాయనో లేక మొహమాటానికి పోయి రోజుకు 3 లక్షల 20 వేల లీటర్ల మంచినీరు మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసే విషయమై కౌన్సిల్ పునరాలోచన చేయాల్సి ఉంది.










