Nov 20,2023 20:02

కార్యకర్తను పరామర్శిస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారని ఐటిడిపి కార్యకర్తపై ఎస్‌ఐ దాడి చేశారు. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తను టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఐటిడిపి మండల అధ్యక్షులు షేక్‌ హుస్సేన్‌ సాబ్‌ను ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ సంజీవ్‌ కుమార్‌లు పోలీసు స్టేషన్‌లో బెల్టు, లాఠీతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితుని వివరాల మేరకు... కోసిగి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సంజీవ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో షేక్‌ హుస్సేన్‌ సాబ్‌కు ఫోన్‌ చేసి అర్జెంట్‌గా అంబులెన్స్‌ కావాలని, ఎక్కడ ఉన్నా కోసిగి ప్రభుత్వాస్పత్రి దగ్గరికి రావాలని చెప్పారు. హుస్సేన్‌ సాబ్‌ హుటాహుటిన ప్రభుత్వాస్పత్రి దగ్గరకు వెళ్లగా అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ సంజీవ్‌ కుమార్‌ సెల్‌ ఫోన్‌ లాక్కొని, బైక్‌పై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎందుకు స్టేషన్‌కు తీసుకొచ్చారని హుస్సేన్‌ సాబ్‌ అడిగారు. ఎస్‌ఐ చెప్పారని, స్టేషన్‌లోనే కూర్చోవాలని చెప్పారు. 4 గంటల తర్వాత ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి రాగానే బెల్ట్‌, లాఠీతో హుస్సేన్‌ సాబ్‌ను కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు 'సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నావు. టిడిపికి బాగా పని చేస్తున్నావు' అని పరుష పదజాలంతో దుర్భాషలాడుతూ తిట్టారు. 'ఎవరికైనా చెబితే నీపైన కేసు పెట్టి మక్కిలి ఇరగకొడతాన'ని బెదిరించారు. రాత్రి 10 గంటల సమయంలో స్టేషన్‌ నుంచి వదిలేశారు. గాయాలతో ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్‌ షుక్లి, మీడియా కోఆర్డినేటర్‌ గౌస్‌లు సోమవారం ఆదోని ఆస్పత్రిలో హుస్సేన్‌ సాబ్‌ను పరామర్శించారు. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి దాసోహమై, టిడిపిలో చురుకుగా పని చేస్తున్న కార్యకర్తలను భయపెడుతున్నారని తెలిపారు. ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ సంజరు కుమార్‌పై కోర్టులో ప్రయివేట్‌ కేసు వేస్తామని చెప్పారు. టిడిపి నాయకులు వక్రాని వెంకటేష్‌, నాడిగేని అయ్యన్న, భరద్వాజ్‌ శెట్టి, రవితేజ శెట్టి, గవిగట్టు వీరయ్య, గుండాల వీరయ్య, సల్మాన్‌ రాజు ఉన్నారు.