Oct 26,2022 23:40

పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి -అడ్డతీగల
అడ్డతీగల, వై.రామవరం మండలాలలో వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్‌ విభాగాల ద్వారా నిర్మిస్తున్న భవనాలు సకాలంలో పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు, బుధవారం వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. వివిధ గ్రామాలలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గ్రామ సచివాలయలను ఆయన పరిశీలించారు. ముందుగా వై.రామవరం మండలం యార్లగడ్డలోని ఆశ్రమ స్కూల్‌ను పరిశీలించి విద్యార్థులకు ఏయే ఆహార పదార్థాలు పెడుతున్నదీ పరిశీలించారు. పి.ఎర్రగొండ ఏకలవ్య మోడల్‌ రిసీవ్‌ స్కూల్లోనూ పరిశీలించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నవి మెనూ ప్రకారం ఆహార పదార్థాలు సకాలంలో విద్యార్థులకు అందజేయుచున్నది లేనిది ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలలో మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు ఆహార పదార్ధాలు తాజాగా పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రులకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం వై .రామవరం, పి. ఎర్రగొండ, పనసల పాలెం, చవితిదిబ్బలు గ్రామాలలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్లను ప్రాజెక్టు అధికారి పరిశీలించారు. అడ్డతీగల మండలం గోందోలు పంచాయతీలోని బోడ్లలంక సమీపంలో కల్వర్ట్‌ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇఇ జి డేవిడ్‌ రాజు, ఐ.శ్రీనివాస రావు, ఎటిడబ్ల్యుఒ హాసని, తదితరులు పాల్గొన్నారు.