Jul 28,2023 20:44

ఆర్‌డిఒకు వినతి పత్రం అందజేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

 జమ్మలమడుగు రూరల్‌ : మైలవరం మండలంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు స్థలం కేటాయించి ఏర్పాటు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం మండలానికి ప్రభుత్వ ఐటిఐ కళాశాల 2015 ఏడాదిలో అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు కళాశాల నిర్మాణానికి స్థలం కేటాయించలేదన్నారు. ప్రభు త్వాలు మారినా కళాశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. మైలవరం ప్రభుత్వ ఐటిఐ కళాశాల జమ్మలమడుగులో నడుస్తోందని పేర్కొన్నారు. రెండు కళాశాలలు రెండు ఒకే చోట ఉండడంతో విద్యార్థులకు సరిపడా రూములు, ప్రాక్టికల్స్‌కు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐటిఐ లలో చేరడానికి ఇప్పటికే విద్యార్థులు శ్రద్ద చూపుతున్నారన్నారు. మైలవరం కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌ కూడా కేటాయించిందని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంవల్ల కళాశాల ఏర్పాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కళాశాలకు భూమి కేటాయించి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని లేకుంటే యువజన సంఘం అధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్‌డిఒ స్పందిస్తూ మైలవరం ఐటిఐ స్థలం కేటాయింపు విషయంపై కలెక్టర్‌కు సిఫార్సు చేశామన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు ఉదరు, సూరి, రాజు, రాఘవ పాల్గొన్నారు.