Aug 17,2022 00:12

శిక్షణ తరగతులు ప్రారంభంలో మాట్లాడుతున్న డాక్టర్‌ గంగారావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరం పరిసర ప్రాంతాలలో నివాసముంటున్న నిరుద్యోగ యువతీ యువకులకు ''జాబ్‌ ఓరియెంటెడ్‌ ఐటి శిక్షణ''ను సిఐటియు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, ఐటి సంస్థలలో ఉద్యోగాలకోసం యువత ఎదురు చూస్తోందని, ప్రభుత్వం నుంచి సహకారం అందక శిక్షణ కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణను వినియోగించుకోవాలని సూచించారు.
క్రోమియం సొల్యూషన్స్‌ డైరెక్టర్స్‌ ఎస్‌.సతీష్‌, ఎ.దివాకర్‌ మాట్లాడుతూ, మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ కేవలం పాఠ్యాంశాలుగానే కాక రియల్‌ టైమ్‌ అప్లికేషన్స్‌ సరిపడే విధంగా ఉంటుందని తెలిపారు. స్థానిక యువతను ప్రోత్సహించడం కోసం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి గంగారావు అభ్యర్థన మేరకు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, స్థానిక యువత ఉద్యోగ అవకాశాల శిక్షణకు హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్తున్నారని, వారికి భారం తగ్గించేందుకు స్థానిక సిఐటియు కార్యాలయాన్ని వినియోగించుకోవడం కోసం సంసిద్ధతను ప్రకటించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరాజు, యు.వెంకటేశ్వర్లు, యు.రామస్వామి, దిలీప్‌కుమార్‌, పృథ్వి పాల్గొన్నారు.