Mar 11,2021 07:08

  నిజంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లను ప్రేరేపించిన హిందూత్వ నాయకులపై ఎన్ని ఫిర్యాదులున్నా ఎటువంటి చర్యలనూ వారి విషయంలో తీసుకోవడం లేదు. మైనార్టీ మతస్తులపై దేశ వ్యతిరేకులనో, పాకిస్తాన్‌ ఏజంట్లనో తరచూ ఆరోపిస్తూనేవున్నా, కొన్ని సందర్భాలలో వారిని ఏరి పారేయాలనో, కాల్చి పారేయాలనో వ్యాఖ్యానిస్తున్నా అవేమీ నేరాలుగా నమోదు కావడమేలేదు. కాని హిందూత్వ విద్వేష రాజకీయాలను విమర్శిస్తే మాత్రం మనోభావాలు గాయపడ్డాయంటూ దాడులు, కేసులు బనాయిస్తున్నారు. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ అనుభవాలను బట్టి కొత్త ఐ.టి నిబంధనలు హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా గొంతెత్తిన విమర్శకుల నోళ్ళు మూయించేందుకే వచ్చాయన్నది స్పష్టం.
  గత వారంలో కేంద్ర ప్రభుత్వం ఐ.టి మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త ఐ.టి రూల్స్‌-2021, అన్ని రకాల ఆన్‌లైన్‌ మీడియా సంస్థలనూ నియంత్రించే మార్గదర్శకాలను నిర్దేశిస్తున్నాయి. ఆన్‌లైన్‌ మీడియాకు సాధనాలుగా ఉపకరిస్తున్న ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి వేదికలను, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ప్రసార వేదికలను, వాట్సప్‌, ట్విట్టర్‌ వంటి మెసేజ్‌ల వేదికలను, వార్తలను అందించే వెబ్‌సైట్లను అన్నింటినీ ఈ నిబంధనలు నియంత్రించనున్నాయి.
  ప్రింట్‌ మీడియా, టి.వి మీడియాలకు ఉన్న విధంగా ఆన్‌లైన్‌ మీడియాకు ఎటువంటి నియంత్రణా లేదని, ఇప్పుడు జారీ చేసిన రూల్స్‌ తో ఆన్‌లైన్‌ మీడియా కూడా ప్రింట్‌, టి.వి మీడియాలతో బాటు ఒకే లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ మీదకు వస్తుందని ప్రభుత్వం చెప్తోంది.
  వాక్‌ స్వాతంత్య్రానికి, భావప్రకటనా స్వేచ్ఛకు ఏవిధంగానూ ఈ నిబంధనలు ఆటంకం కాబోవని, ఇది కేవలం ఒక 'సౌమ్యమైన రీతిలో ఉండే పర్యవేక్షణ' మాత్రమేనని ఐ.టి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. కాని ఆయన ప్రకటన వొట్టి పంచదారపూత మాత్రమే. ఈ కొత్త నిబంధనలతో ప్రభుత్వ యంత్రాంగానికి మీడియాను నియంత్రించే అధికారాలు అవధులు లేనంతగా సంక్రమిస్తాయి. మీడియా సంస్థల్లో ప్రభుత్వం చొరబడడానికి, ఒత్తిడి చేయడానికి, సెన్సార్‌ చేయడానికి అపరిమిత అవకాశాలు ఈ నిబంధనల ద్వారా కలుగుతాయి.
  ప్రింట్‌ మీడియాకు ఈ నిబంధనలు వర్తించవని చెప్పారు. కాని అవే పత్రికలు నడిపే వెబ్‌సైట్లకు మాత్రం వర్తిస్తాయి. అంటే అర్ధం ఏమిటి? ప్రింట్‌లో ఉన్నదే వెబ్‌సైట్లో కూడా ఆ పత్రిక ఉంచుతుంది. అప్పుడు వెబ్‌సైట్‌ను నియంత్రించడమంటే ప్రింట్‌ మీడియాను కూడా నియంత్రించడమే కదా?
  నిజానికి ప్రింట్‌ మీడియాకు ప్రెస్‌ కౌన్సిల్‌ అనే ఒక స్వయం నియంత్రణ పాటించే వేదిక ఉంది. ప్రభుత్వ అధికారులు నేరుగా పత్రిక లో అచ్చయ్యే సమాచారం విషయంలో జోక్యం చేసుకోడానికి వీలు లేదు. అదే మాదిరిగా కాకపోయినా, రేడియో, టి.వి లకు 'న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఉంది. ఈ మాధ్యమాలలో కూడా ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యానికి వీలు లేదు. కాని ఇప్పుడు తెచ్చిన ఐ.టి రూల్స్‌-2021 మాత్రం ఆన్‌లైన్‌ మీడియాలో నేరుగా ప్రభుత్వ జోక్యానికి వీలు కల్పిస్తున్నది. మరి ఇక లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఎక్కడుంది?
 

                                              మూడు దొంతరల నియంత్రణ వ్యవస్థ

    ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా సంస్థ స్వయంగా ఏర్పాటు చేయవలసిన నియంత్రణ అధికారి మొదటి దొంతరలో ఉంటారు. ఆ పైన ఆన్‌లైన్‌ పరిశ్రమ మొత్తంగా ఏర్పాటు చేయవలసిన స్వయం నియంత్రణ సంస్థ ఉంటుంది. దానికి ఒక రిటైర్‌ అయిన న్యాయమూర్తి నాయకత్వం వహించాలి. ప్రభుత్వం ఇచ్చే జాబితా నుండి ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తిని ఎంపిక చేయాలి. ఆపైన మూడో స్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన నియంత్రణ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తరఫున మీడియా సంస్థ దేనిపైన అయినా చర్య తీసుకోవలసి వస్తే అందుకోసం ఒక జాయింట్‌ సెక్రటరీ హోదా కలిగిన అధికారి నియమించబడతాడు.
   ఏదైనా వార్త పట్ల, లేదా సమాచారం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తి ముందు నేరుగా ఆ జాయింట్‌ సెక్రటరీకి ఫిర్యాదు పంపాలి. అంటే మూడు దొంతరల నియంత్రణలో కింది నుండి పైకి కాకుండా, పైనుండి కిందికి జోక్యం ప్రారంభమౌతుంది. అంటే ప్రభుత్వ పెత్తనం పెరుగుతుంది.
   ఫిర్యాదు అందుకున్న అధికారి దానిని మీడియా స్వయం నియంత్రణ అధికారికి పంపుతాడు. అక్కడ ఫిర్యాదీకి న్యాయం జరగలేదంటే ఆ తర్వాత రెండో అంచె నియంత్రణ వ్యవస్థకు, ఆ తర్వాత మూడవ అంచెకు ఫిర్యాదు చేరుతుంది. ట్విట్టర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం గాని, వెబ్‌ పోర్టల్‌ను బ్లాక్‌ చేయడం గాని, ఇంకా అంతకన్నా తీవ్రమైన చర్యలుగాని ఈ నియంత్రణ వ్యవస్థ చేపడుతుంది.
 

                                 అస్పష్టమైన నిర్వచనం.. దుర్వినియోగానికి అపార అవకాశం

   ''దేశ సమైక్యతకు, సమగ్రతకు, రక్షణకు, భద్రతకు, సార్వభౌమత్వానికి, సమాజంలో శాంతిభద్రతలకు భంగకరంగా ఉన్నాయని గాని, అల్లర్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనిగాని, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గాని '' ఎవరైనా ఆన్‌లైన్‌లో వచ్చే సమాచారం గురించి భావిస్తే వారు ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమాచారం ఆ విధంగా ఉందని నియంత్రణ వ్యవస్థ ఏ స్థాయిలో భావించినా అటువంటి సమాచారం ఇవ్వడం నేరం అవుతుంది. అంతేగాక, ''ఏదైనా ఒక జాతి, లేదా మతానికి చెందిన జన సమూహపు కార్యక్రమాలను, విశ్వాసాలను, అభిప్రాయాలను'' పరిగణన లోకి తీసుకోకుండా వ్యవహరించినా అది నేరం అవుతుంది. ఈ విధమైన నిర్వచనం ఎంత అస్పష్టంగా ఉందంటే ఎవరినైనా తమ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు నేరస్తుల్ని చేసేయవచ్చు. ఇప్పుడు 'ఉపా' చట్టాన్ని ఆ విధమైన వర్తింపుతోటే కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. పలువురు మేథావులను విచారణ లేకుండా ఏళ్ళతరబడి జైళ్ళల్లో నిర్బంధిస్తున్నాయి.
   అదే సమయంలో నిజంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లను ప్రేరేపించిన హిందూత్వ నాయకులపై ఎన్ని ఫిర్యాదులున్నా ఎటువంటి చర్యలనూ వారి విషయంలో తీసుకోవడం లేదు. మైనార్టీ మతస్తులపై దేశ వ్యతిరేకులనో, పాకిస్తాన్‌ ఏజంట్లనో తరచూ ఆరోపిస్తూనేవున్నా, కొన్ని సందర్భాలలో వారిని ఏరి పారేయాలనో, కాల్చి పారేయాలనో వ్యాఖ్యానిస్తున్నా అవేమీ నేరాలుగా నమోదు కావడమేలేదు. కాని హిందూత్వ విద్వేష రాజకీయాలను విమర్శిస్తే మాత్రం మనోభావాలు గాయపడ్డాయంటూ దాడులు, కేసులు బనాయిస్తున్నారు. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ అనుభవాలను బట్టి కొత్త నిబంధనలు హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా గొంతెత్తిన విమర్శకుల నోళ్ళు మూయించేందుకే వచ్చాయన్నది స్పష్టం.
 

                                                          చట్టబద్ధత ఏదీ ?

    'ఐ.టి చట్టం-2000' కింద ఈ నిబంధనలను జారీ చేశారు. అయితే, ఆ చట్టం వార్తా సంస్థలకు వర్తించదు. ఆన్‌లైన్‌ మీడియాకు వర్తించే చట్టం ఇంతవరకూ లేదు. ఏ చట్టమూ లేకుండానే నిబంధనలను జారీ చేయడం చెల్లదు. అంటే మోడీ ప్రభుత్వం చట్ట ప్రకారం చెల్లని నిబంధనలను తెచ్చింది. ఐటి చట్టం కింద నిబంధనలను తెచ్చారు. కాని వీటి అమలు జరిగేది మాత్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఇది మరో తప్పు.
   గతంలో ఐ.టి చట్టం లోని 66(ఎ) అధికరణ ప్రకారం ఆన్‌లైన్‌ సమాచారాన్ని నియంత్రించబోతే. సుప్రీం కోర్టు ఆ 66(ఎ) అధికరణం చెల్లదని, ప్రాధమిక హక్కుగా 19(1)(ఎ) అధికరణ ప్రకారం గ్యారంటీ చేయబడిన వాక్‌, సభా, పత్రికా స్వాతంత్య్రాలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగకరం అని 66(ఎ) అధికరణాన్ని కొట్టేసింది. ఇప్పుడు అదే ఐ.టి చట్టం కింద తెచ్చిన ఈ రూల్స్‌ కూడా ఆ విధంగానే చట్టప్రకారం చెల్లవు.
ఏదైనా నియంత్రణ తీసుకురావాలంటే అందుకు అవసరమైన చట్టాన్ని ముందు పార్లమెంటులో చేయాలి. పార్లమెంటులో ఏ చర్చా లేదు. ఏ చట్టమూ చేయలేదు. కాని నిబంధనలు మాత్రం జారీ చేసేశారు. పార్టమెంటును బేఖాతరు చేశారు. ఆ విధంగా కూడా ఈ రూల్స్‌ చెల్లవు.

                                               కరోనా సమయంలోనే రంగం సిద్ధం

     ఇటీవల 'కారవాన్‌' అనే పత్రిక ఒక డాక్యుమెంట్‌ను బహిర్గతం చేసింది. దాని ప్రకారం ఈ నిబంధనలను తీసుకురావాలన్న పథకం 2020 సంవత్సరం మధ్యలోనే రూపుదాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం పెరిగిపోతున్నదని, విమర్శకులు ఎక్కువైనారని, వారిని ఏదోవిధంగా ''తటస్తీకరించాలని'' భావించి అందుకోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, రవిశంకర్‌ ప్రసాద్‌, స్మృతి ఇరానీ, ప్రకాష్‌ జవదేకర్‌, ఎస్‌ జయశంకర్‌ క్యాబినెట్‌ ముంత్రులుగా, కిరణ్‌ రిజిజు, హర్‌దీప్‌సింగ్‌ పూరీ, అనురాగ్‌ ఠాకూర్‌, బాబుల్‌ సుప్రియో సహాయ మంత్రులుగా ఉన్నట్టు డాక్యుమెంట్‌ వెల్లడి చేసింది. ఈ నివేదిక గురించి 'హిందూస్తాన్‌ టైమ్స్‌' పత్రిక కూడా గత డిసెంబర్‌ నెలలోనే రాసింది.
 

                                                   జర్నలిస్టులకు రంగులు !

    జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు కుడిభుజం వంటి నితిన్‌ గోఖలే జర్నలిస్టులకు ఆకుపచ్చ (గోడ మీద పిల్లిలా అటూ ఇటూ కాకుండా ఉన్నవారు), నలుపు (ప్రభుత్వాన్ని విమర్శించేవారు) తెలుపు (ప్రభుత్వాన్ని సమర్ధించేవారు) అని మూడు తరహాలుగా రంగులు కేటాయించాలని కోడ్‌లు సూచించారు. తెల్ల జర్నలిస్టులకు పూర్తిగా తోడ్పాటు అందించాలని, నల్ల జర్నలిస్టులను తటస్తీకరించాలని సలహా ఇచ్చారు. కారవాన్‌ విషయం బైటపెట్టాక అటువంటిదేమీ లేదని బుకాయించాడు. కాని డాక్యుమెంటు విషయాన్ని ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఖండించలేదు.
   ఇక ప్రసార భారతికి డైరెక్టరుగా ఉన్న సూర్యప్రకాష్‌ నల్ల జర్నలిస్టులను అణచివేయడానికి ప్రభుత్వం తన వద్దనున్న అపారమైన అధికారాలన్నీ వాడాల్సిందేనని సలహా ఇచ్చారు. ఇంకో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతవేత్త ఎస్‌ గురుమూర్తి 'మరో పోఖ్రాన్‌ ఎఫెక్ట్‌' అవసరం అన్నారు. బహుశా ఇదేదో సర్జికల్‌ స్ట్రయిక్‌ లాంటిదేమో. ప్రభుత్వ మంత్రులు మీడియాలో ఏమి రాసినా, దానివలన ప్రభుత్వం పట్ల ప్రతికూలతే వస్తోందని, అందుచేత ఏ నితిష్‌ కుమార్‌నో, నవీన్‌ పట్నాయక్‌నో రంగంలోకి దింపి ప్రభుత్వానికి కితాబులిప్పించాలని ఆయనగారు చెప్పారు.
అత్యంత 'నల్ల' పాత్రికేయులను 50 మందిని గుర్తించి వారి వ్యవహారాలను ప్రభుత్వం నిరంతరం ఓ కంట కనిపెట్టాలని స్మృతి ఇరానీ చెప్పారు. అత్యంత 'తెల్ల' జర్నలిస్టులు 50 మందిని గుర్తించి వారిని అన్ని విధాలుగానూ ప్రోత్సహించాలన్నారు.
   ఈ ఉపసంఘం కొంతమంది పాత్రికేయులను, మాజీ అధికారులను, వి.సి లను సంప్రదింపులకు ఆహ్వానించి వారి సలహాలు కోరింది. అలోక్‌ మెహతా, జయంత్‌ ఘోశల్‌, శిశిర్‌ గుప్తా, ప్రఫుల్‌కెట్కర్‌, మహువా చటర్జీ, నిస్తులా హెబ్బర్‌, అమితవ్‌ సిన్హా, అశుతోష్‌, రామ్‌నారాయణ్‌, రవీష్‌తివారీ, హిమాంశుమిశ్రా, రవీంద్ర వంటి మితవాద జర్నలిస్టులు పాల్గొన్నారు.
  వైర్‌, స్క్రోల్‌, హిందూ వంటి ఆన్‌లైన్‌ మీడియా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిశీలించాలని దాదాపు అందరూ అభిప్రాయ పడ్డారు. పలు ప్రాంతీయ వార్తా మాధ్యమాలను కూడా పరిశీలించాల్సిందేనని అభిప్రాయాలు వచ్చాయి. వార్తల్లో వాస్తవమేదో, కానిదేదో తేల్చి చెప్తున్న ఆల్ట్‌ న్యూస్‌ చేస్తున్నదంతా వొట్టి ప్రచారం మాత్రమేనని, ఆప్‌ ఇండియా వంటి (కాషాయ) ఆన్‌లైన్‌ మాధ్యమాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఎడిటర్లతో, జర్నలిస్టులతో, వ్యాఖ్యాతలతో కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసి తరచూ సంప్రదించాలని కోరారు. విదేశీ మీడియా జోలికి పోవద్దని, వారితో ఏది మాట్లాడినా అది అంతిమంగా ప్రభుత్వానికి ప్రతికూలంగానే పరిణమిస్తోందని అన్నారు.
రోజులు మారాయి
   దేశంలో విద్వేషపూరిత రాజకీయాలను రెచ్చగొట్టడానికి, అబద్ధాలను పెద్దఎత్తున ప్రచారం చేయడానికి, పుకార్లను వ్యాపింపజేయడానికి ఆన్‌లైన్‌ మీడియాను గత దశాబ్దకాలంలో బాగా దుర్వినియోగపరచిన ఘనత బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమికే దక్కుతుంది. ప్రత్యర్ధులపై తప్పుడు ప్రచారానికి వారేవిధంగా ట్రోలింగ్‌ కు పాల్పడతారో వివరంగా కథనాలు చాలా వచ్చాయి.
    అయితే, ఇప్పుడు గాలివాటం మారుతోంది. ఆన్‌లైన్‌లో హిందూత్వ శక్తులు సాగించిన ప్రచారానికి, వాస్తవానికి ఉన్న తేడాను ప్రజానీకం, ముఖ్యంగా ఆన్‌లైన్‌ మీడియాలో ఎక్కువగా పాల్గొనే యువత, మధ్యతరగతి ప్రజానీకం బాగా తెలుసుకున్నారు. కరోనా కాలంలో మోడీ ప్రభుత్వ వైఫల్యం, కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతున్న వైనం వారికి బాగా బోధపడుతోంది. అందుకే అదే ఆన్‌లైన్‌ మీడియాలో ఇప్పుడు మోడీ విధానాలను తూర్పారబట్టేవారు, ప్రశ్నించేవారు బాగా పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న రైతు ఉద్యమం జాతీయంగానే గాక, అంతర్జాతీయంగా కూడా మోడీ విధానాలను బట్టబయలు చేస్తోంది.
  అందుకే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీడియాపై అప్రకటిత సెన్సార్‌షిప్‌కు పూనుకుంటోంది. ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే, ప్రజా ఉద్యమాలు మనగలగాలంటే భావ ప్రకటనా స్వేచ్ఛకు మోడీ వేయజూస్తున్న ఈ సంకెళ్ళను బద్దలుగొట్టాలి. ఇది ప్రజాస్వామ్యవాదులందరి కర్తవ్యం.

ఎం.వి.ఎస్‌. శర్మ